ఏపీ రాజకీయాలు ఆసక్తకరంగా మారుతున్నాయి. ఎన్నికల దగ్గరపడేకొద్దే పార్టీలన్నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. ఈ ఉత్సాహంలో చేసే పనులన్నీ వారికే మైనస్ గా మారుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలకు చేతులారా ఆయుధాల్ని అందిస్తున్నాయి. ప్రాంతీయపార్టీలం కాబట్టి తామేం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఈ పరిణామాలు తమకు కలిసివస్తున్నాయని పండగ చేసుకుంటున్నాయి జాతీయ పార్టీలు. ఇంతకీ నవ్యాంధ్రలో ఏం జరుగుతోంది..?ఏపీలో పరిణామాలు రోజుకు రోజుకు మారుతున్నాయి. మొన్నటిదాకా హోదా అంశం కుదిపేస్తే.. ఇప్పుడు కాపు రిజర్వేషన్ వ్యవహారం కాక రేపుతోంది. జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొన్న రిజర్వేషన్ ఇవ్వలేమని చేతులెత్తేసిన జగన్.. ఇప్పుడు తాము వ్యతిరేకం కాబోమని మాట మార్చిన పరిస్థితి తెలిసిందే. ఒకవేళ అధికారంలోకి వచ్చినా రిజర్వేషన్ల విషయంలో తామేం చేయలేమని జగన్ చెప్పకనే చెప్పారు. రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర పరిధిలో లేవని కేంద్రం పరిధిలో ఉన్నవని .. ప్రాంతీయ పార్టీలుగా తామేం చేయలేమని జగన్ చెప్పారు. ఇది ఒకరకంగా జాతీయ పార్టీలకు ఊతమిచ్చినట్టేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ జగన్ ప్రకటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏపీలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు కేంద్రంతో యుద్ధమే చేస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ కేంద్రాన్ని ఢీకొడుతున్నారు. అంతేకాదు మోడీ సర్కార్ పై విశ్వాస పరీక్ష కూడా పెట్టారు. రాష్ట్రానికి రావలసిన నిధులపై పోరాటమే చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం అహర్నిశలు శ్రమపడుతున్నారు. ఇన్నిరకాలుగా పోరాటం చేస్తున్నా రాష్ట్రానికి సాయం అందించే విషయంలో కేంద్రం నాన్చుడి ధోరణి అవలంబిస్తోందని ఆపార్టీ నేతలే అంటున్నారు. అంటే అన్నీ కేంద్రంచేతిలో ఉన్నాయన్నమాట. సమస్యలపై పోరాడుతున్నా ఒకరకంగా ప్రాంతీయపార్టీ కాబట్టి ఇంతకంటే తానేమీ చేయలేనని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో హ్యాండిచ్చినందుకు బీజేపీని నమ్మే పరిస్థితులో అక్కడి ప్రజలు లేరు. ఇక మిగిలింది కాంగ్రెస్. ఏపీ విభజన తర్వాత గిలగిలా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఆపార్టీ నేతలు ఇప్పుడిప్పుడే నడుం బిగిస్తున్నారు. అయితే ప్రధాని మోడీనే కాంగ్రెస్ కు ఊపిరిపోశారని ఆపార్టీ నేతలంటున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్ల అమలు అంశాలు .. ఏపీలో కాంగ్రెస్ కు కాలుమోపే అవకాశాన్ని కల్పించాయని చెబుతున్నారు. ఈ రెండు అంశాలతో ప్రజల్లోకి దూసుకెళ్లొచ్చని.. గత ఎన్నికల కన్నా ఓటు బ్యాంకు మెరుగుపరచుకోవచ్చని కాంగ్రెస్ సీనియర్లు అనుకుంటున్నారట. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ ఉమెన్ చాందీలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా దీన్ని బలపరుస్తాయి. హోదా, విభజన హామీలు, కాపు రిజర్వేషన్లు.. జాతీయ స్థాయిలో జరగాల్సినవి. జాతీయ పార్టీలు మాత్రమే వాటిని నెరవేర్చగలదు. చేస్తే కాంగ్రెస్ చేయాలి లేదా బీజేపీ నెరవేర్చాలి. బీజేపీ ఈ అంశంలో ఫెయిల్ అయింది. ఇక మిగిలింది కాంగ్రెస్ మాత్రమే. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీటిని అమలు చేసి తీరుతాం అన్న హామీతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ వార్ రూమ్ డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ అవసరమైతే దీనిపై లిఖితపూర్వక హామీని ఏపీ ప్రజలకు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని రఘువీరారెడ్డి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ పార్టీగా కాపు రిజర్వేషన్ల అంశంపై తానేమీ చేయలేనని జగన్ ప్రకటించగా.. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై చంద్రబాబు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఇందులో ప్రాంతీయ పార్టీలుగా తాము చేసేదేమీ లేదన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం కాంగ్రెస్ కి కలసొచ్చే అంశం. ఇలా పాతాళంలోకి పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ ను అన్ని పార్టీలు అనుకోకుండా సాయం చేసి పైకి లేపుతున్న పరిస్థితే కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ కీలక అంశాలపై రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.