నిర్మాణ సంస్థలు: అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, విస్ట డ్రీమ్ మర్చంట్స్
తారాగణం: అడివి శేష్, శోభితా దూళిపాళ, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, మధుశాలిని, అనీష్ కురివెల్ల, సుప్రియ యార్లగడ్డ, వెన్నెల కిశోర్ తదితరులు
సంగీతం: శ‌్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: శనీల్ డియో
మాటలు: అబ్బూరి రవి
కూర్పు: గారి బి.హెచ్
కథ: అడివిశేష్
స్క్రీన్‌ప్లే: అడివిశేష్, రాహుల్, శశికిరణ్ తిక్క
సహ నిర్మాత: వివేక్ కూచిబోట్ల
నిర్మాతలు: అభిషేక్ నామ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం: శశి కిరణ్ తిక్క
క్షణం చిత్రంతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న అడివి శేష్.. రెండేళ్ల గ్యాప్ తర్వాత చేసిన చిత్రం `గూఢచారి`. జేమ్స్ బాండ్ మూవీ. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. హీరోగా నటిస్తూనే శేష్.. కథ అందించాడు. అంతే కాకుండా స్క్రీన్‌ప్లే విషయంలో తనదైన సహాయ సహకారాన్ని అందించాడు. బాండ్ మూవీ కదా! ఎంత ఖర్చు అయ్యిందో అనుకోవచ్చు. కానీ చాలా తక్కువ బడ్జెట్‌లో సినిమాను చేశామని నిర్మాతలే చెప్పడం విశేషం. అంచనాలను నడుమ విడుదలైన గూఢచారి గురించి తెలియాలంటే కథ గురించి తెలుసుకుందాం...
కథ
ఇండియన్ రా విభాగంలో పనిచేసే సత్య(ప్రకాశ్‌రాజ్) దేశం కోసం ఓ ఆపరేషన్ చేస్తుండగా.. ప్రత్యర్థుల కాల్పుల్లో సత్య స్నేహితుడు రఘువీర్ చనిపోతాడు. రఘువీర్ కొడుకు గోపి(అడివి శేష్)ని సంరక్షించే బాధ్యతను సత్య తీసుకుని అతడి పేరుని అర్జున్‌గా మార్చేస్తాడు. ఉద్యోగం మానేసి ఎవరికీ కనపడకుండా అజ్ఞాతంలో ఉంటారు. పెరిగి పెద్దయిన అర్జున్ దేశం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో తండ్రిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని రా విభాగం కోసం అప్లై చేస్తాడు. 174 సార్లు అప్లై చేసిన తర్వాత 175వ సారి రా విభాగంలోకి అర్జున్ సెలక్ట్ అవుతాడు. దేశ రక్షణ కోసం సరిహద్దులు దాటి పనిచేసే రా లో త్రినేత్ర విభాగంలో అర్జున్ జాయిన్ అవుతాడు. అదే సమయంలో సైకాలజిస్ట్ సమీర(శోభితా దూళిపాళ)తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే టెర్రరిస్టు నాయకుడు రాణా ఓ ప్లాన్ వేసి రా విభాగానికి చెందిన పెద్ద ఆఫీసర్స్‌ను చంపేసి ఆ నేరం అర్జున్‌పై మోపుతాడు. తనపై పడ్డ నిందను అర్జున్ ఎలా తొలగించుకున్నాడు. ఈ క్రమంలో దేశం కోసం అర్జున్ ఏం చేశాడు. ఈ ప్రయాణంలో అర్జున్‌కి తెలిసిన నిజాలేంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్
నటీనటులు
కథ, స్ర్కీన్‌ప్లే
కెమెరా వర్క్
ఇంటర్వెల్ బ్యాంగ్
నేపథ్య సంగీతం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
రొటీన్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవచ్చు.
విశ్లేషణ
జేమ్స్ బాండ్ సినిమాలంటే మనకు గుర్తుకు వచ్చేవి కృష్ణ నటించిన గూఢచారి 116, చిరంజీవి గూడచారి నెం.1 చిత్రాలే.. అలాంటి టైటిల్‌తో సినిమా రూపొందుతోందంటే కచ్చితంగా సినిమాపై అంచనాలుంటాయనడంలో ఏ సందేహం లేదు. సినిమా ఆ అంచనాలకు ధీటుగా ఉండాలి. అడివి శేష్, శశికిరణ్ తిక్క అండ్ టీం ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు కట్టి పడేశారు. హీరో క్యారెక్టర్ ‘రా’లోకి వెళ్లడం.. ఆ సన్నివేశాలు.. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు.. మధ్య మధ్యలో హీరోను ఎవరో అబ్జర్వ్ చేయడం.. ఇంటర్వెల్ ముందు ప్లాన్ చేసి హీరోని ఇరికించడం.. అన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో హీరో తనపై జరిగిన కుట్రను క్లియర్ చేసుకునే సందర్భంలో సమస్యలను ఫేస్ చేయడం.. వాటిని డీ కోడ్ చేస్తూ ముందుకెళ్లడం అన్నీ సూపర్బ్‌గా ఉన్నాయి. ఇక జగపతిబాబు పాత్రను రివీల్ చేసిన తీరు.. ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది.
శ్రీచరణ్ పాకాల మంచి నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ఎన్‌హెన్స్ చేశారు. అలాగే శనీల్ డియో కెమెరా వర్క్‌తో ప్రతి సన్నివేశం చాలా రిచ్‌గా ఉంది. అడివి శేష్ పడ్డ కష్టం తెరపై కనపడుతుంది. కథ, స్క్రీన్‌ప్లేలో భాగం అవడమే కాకుండా.. హీరోగా నటించిన తీరు మెప్పిస్తుంది. శోభితా దూళిపాళ పాత్ర ఫస్టాఫ్‌కే పరిమితమైనా చక్కగా ఉంది. 22 ఏళ్ల తర్వాత నటించిన సుప్రియ యార్లగడ్డ మంచి పాత్రలో నటించారు. అనీశ్ కూడా మంచి పాత్ర చేశారు. వెన్నెలకిశోర్ పాత్ర పంచ్‌లతో కామెడీ పుట్టించే ప్రయత్నం బావుంది. ముఖ్యంగా కథలో ట్విస్టులు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఇలా అన్నీ.. ప్రేక్షకులను ఆకట్టకుంటాయి.