శ్రీలంక ప్రధానమంత్రి రాణిల్ విక్రమ సింఘే, ఆయన సతీమణి ప్రొఫెసర్ మైత్రి విక్రమసింఘే, వారితోపాటు వచ్చిన శ్రీలంక అధికారుల బృందం శుక్రవారం ఉదయం తిరుమలలో వెంకన్న ను దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయ మర్యాదలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లిని వారికి విఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి దర్శనం అధికారులు చేయించారు. శ్రీవారి దర్శనానంతరం, రంగనాయక మండపంలో శ్రీలంక ప్రధానమంత్రి దంపతులకు వేదాశ్వీర్వచనం పలికిన వేదపండితులు. శ్రీవారి లడ్డూ, తీర్థ ప్రసాదాలను, శ్రీ పద్మావతి సహిత వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని శ్రీలంక ప్రధానమంత్రి దంపతులకు అందించారు. అనంతరం, ఆలయం వెలుపల మీడియా పాయింట్ లో రాణిల్ విక్రమసింఘే మీడియాతో మాట్లాడారు. తాను, తన కుటుంబ సభ్యులు తరచూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తూ ఉంటామని అన్నారు. ఈ సారి భారత పర్యటన కోసం ఏర్పాట్లను చేయించిన భారత ప్రభుత్వానికి, ప్రత్యేకంగా తన ప్రోటోకాల్ కోసం ఒక మంత్రిని ఏర్పాటు చేసి కనులారా శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, టిటిడి కి ధన్యవాదాలను తెలిపారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని, కరుణానిధి ఆరోగ్యంపై స్టాలిన్, కనిమొళి లతో నిన్న ఫోన్ ద్వారా మాట్లాడానని శ్రీలంక ప్రధానమంత్రి తెలిపారు. శ్రీలంక - భారత ప్రభుత్వాల పరస్పర సహకారంతో డీప్ సీ ఫిషర్మెన్ సమస్య సానుకూలంగా పరిష్కారమైందని, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో భారత దేశ సభ్యత్వానికి శ్రీలంక దేశం తరఫున తాము సానుకూలంగా ఉన్నట్లు శ్రీ రాణిల్ విక్రమ సింఘే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మైనింగ్ శాఖ మంత్రి సుజయ కృష్ణారంగారావు, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు, ప్రోటోకాల్ అదనపు సెక్రెటరీ లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ బాబు, డిఐజి ఎం. ప్రభాకర్ రావు, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి, జిల్లా యంత్రాంగం తరఫున లయజనింగ్ ఆఫీసర్ చిత్తూరు ఆర్డీఓ కోదండరామి రెడ్డి, ఇంఛార్జి సివిఎస్ఓ, తిరుమల డిఎస్పీ , శ్రీలంక అధికారుల బృందం, చెన్నైలో ఉన్న శ్రీలంక డిప్యూటీ హై కమీషన్ అధికారుల బృందం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో శ్రీలంక ప్రధానమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేశారు.