ఏలేరు ఆధారిత పరిధిలో 67 వేల ఎకరాల నిర్దిష్ట ఆయకట్టు ఉంది. దీంతో పాటు మరో 30 వేల ఎకరాలకు అదనంగా సాగునీటిని అందించేలా పనులు ప్రారంభించారు. వీటిని రెండు దశలుగా విభజించి మొదటి దశ పనులను రూ.127.59 కోట్లతో 2014 మే నెలలో చేపట్టారు. ఇవి ఈ ఏడాది మే నెలకు పూర్తికావాల్సి ఉంది. రెండో దశ పనులు రూ.137 కోట్లతో ఈఏడాది మార్చిలో ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటికీ టెండర్లు పూర్తికాలేదు. ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో ఆయకట్టు విస్తరించి ఉంది. ఎప్పుడో నీటి వాలుకు వీలుగా ఏర్పడిన కాలువల పైనే అక్కడక్కడా నిర్మాణాలు చేపట్టి సాగునీటిపారుదల వ్యవస్థను నిర్వహిస్తున్నారు.
25 ఏళ్ల కిందట రూ.25 కోట్లతో ప్రారంభమైన ఏలేరు ఆధునికీకరణ అంచనా విలువ ప్రస్తుతం రూ.260 కోట్లకు చేరింది. ఏలేరు ఆధారిత కాలువను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు 790 ఎకరాలు అవసరం అవుతుంది. ఇందులో 460 ఎకరాలు ప్రభుత్వ భూమిలోని కాలువలు కాగా వాటి వెంట ఉన్న 335 ఎకరాలు సేకరించాల్సి ఉంది. పిఠాపురం, కిర్లంపూడి, పెద్దాపురం సెక్షన్ల పరిధిలో 130 ఎకరాలు రైతుల నుంచి సేకరించి వారికి రూ.30 కోట్లు చెల్లించారు. ఇంకా 205 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇందులో పిఠాపురం మండలం గోకివాడ, రాపర్తి, జములపల్లి, కోలంక, భోగాపురం, ఇల్లింద్రాడ గ్రామాల్లో 110 ఎకరాలు, కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామంలో 33 ఎకరాలకు సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తయినా నిధులు విడుదల కాలేదు. మరో 65 ఎకరాలు కిర్లంపూడి మండల పరిధిలోని భూపాలపట్నం, గెద్దనాపల్లి, రామకృష్ణాపురం, రాజుపాలెం, ఎస్.తిమ్మాపురం, తామరాడ, పెద్దాపురం మండలం కాండ్రకోట, కట్టమూరు, ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామాల పరిధిలో సేకరించాల్సి ఉంది. దీనికి ఇప్పటి వరకు సర్వే ప్రక్రియే పూర్తికాలేదు. ఈ భూములకు సుమారు రూ.50 కోట్లు అవసరం కానున్నాయి.
మొదటి దశ పనుల్లో కొన్ని కీలకమైన నిర్మాణాలు ప్రతిపాదించారు. వాటిలో కిర్లంపూడి, పెద్దాపురం, పిఠాపురం సెక్షన్ల పరిధిలో కాలువలకు సక్రమంగా నీరుపారేలా నాలుగు క్రాస్ రెగ్యులేటర్లు, 19 బెడ్ రెగ్యులేటర్లు, 35 ఓటిస్లూయీస్‌లు, 20 ఆర్‌సీసీ స్లాబ్‌లు, 143 పైపు స్లూయిస్‌లు, ఆక్విడక్ట్, ఏడుచోట్ల స్లాబ్ కల్వర్టులు.. ఇతర నిర్మాణాలు అన్నీ కలిపి 50 శాతంగా, కాలువలను తవ్వి విస్తరించే పనిని 50 శాతం మేరకు ప్రతిపాదించారు. వీటిలో ప్రధాన నిర్మాణాల్లో 80 శాతం పనులు పూర్తయ్యాయి. పెద్దాపురం మండలం కాండ్రకోట దబ్బకాలువపై, కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురం గ్రామంలోని ఎర్రకాలువపై నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. రాజుపాలెం వాలు కాలువపై నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రాష్ట్రంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకూ లేని విధంగా పంట కాలువలు, మురుగునీటి కాలువలు కలిపి ఉండడం ఏలేరులోనే కనిపిస్తుంది. దీనివల్ల ఆయకట్టు పరిధిలో కొంత ఇబ్బంది ఏర్పడింది. ప్రస్తుత ఆధునికీకరణలో అయినా పంట కాలువలు, మురుగు కాలువలను వేరుచేస్తారని రైతులు ఆశించారు. ఏలేరు ప్రధాన కాలువ నుంచి కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురం మీదుగా ప్రారంభమయ్యే ఎర్రకాలువ గెద్దనాపల్లి, ముక్కొల్లు, రెగ్యులేటరు మీదుగా పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని గ్రామాల గుండా సముద్రంలో కలిసేలా 80 నుంచి 120 మీటర్లు వెడల్పు చేస్తున్నారు. ఈ కాలువ వెంట 70 వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేసేలా రూపకల్పన చేశారు. ఇప్పటికే ఈ కాలువపై ఉన్న గెద్దనాపల్లి రెగ్యులేటర్‌ను 80 మీటర్ల వెడల్పుతో కొత్తగా నిర్మించారు. అదే కాలువపై ఉన్న ముక్కొల్లు రెగ్యులేటర్‌ను జలవనరుల శాఖ అధికారుల నిర్యక్ష్యం కారణంగా ఐబీఎం (ఐటం బెంచ్ మార్కు)లో చేర్చకుండా వదిలేశారు. ప్రస్తుతం 30 మీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ రెగ్యులేటర్ వెంట కుడి, ఎడమ కాలువల ద్వారా ఆరు వేల ఎకరాలకు సాగునీరు సరఫరా కావాల్సి ఉంది. దీనిని వరద కాలువగా విస్తరించనుండడంతో 80 మీటర్ల వెడల్పున రెగ్యులేటర్‌ను నిర్మించి కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని అందించాల్సి ఉండగా దీని విషయాన్ని మొదటి దశ పనుల్లో ఎక్కడా ప్రస్తావించలేదు.
ఏలేరు ప్రధాన కాలువ నుంచి మొదటి దశలో తిరుమాలి మీదుగా ఎర్రవరంలోని మంగళి కాలువ నుంచి ఏలేశ్వరం మండలం ఎర్రవరం, పెద్దనాపల్లి, కిర్లంపూడి మండలం వేలంక, గెద్దనాపల్లి, జగపతినగరం, సింహాద్రిపురం తదితర గ్రామాల్లో 16 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఏలేరు ప్రధాన కాలువలో ఇసుక తవ్వేయడంతో కాలువ లోతుగా మారి తిరుమాలి నుంచి ఉన్న ఎర్రవరం కాలువకు 20 ఏళ్లుగా సాగునీరు పారడంలేదు. దీనికి పరిష్కారంగా ఆధునికీకరణలో భాగంగా తిరుమాలి వద్ద రూ.12 కోట్లతో రెగ్యులేటర్‌ను నిర్మించారు. దీనికి ఎడమ భాగం నుంచి కాలువ ఏర్పాటు చేయాల్సి ఉంది. ముందు నుంచి ఉన్న కాలువను ఎర్రవరం గ్రామంలో నామరూపాలు లేకుండా పూడ్చేసి ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి గ్రామంలో ఎర్రకాలువపై రూ.5 కోట్లతో నిర్మించిన రెగ్యులేటర్ కుడి, ఎడమ కాలువలకు స్లూయీస్‌లు నిర్మించాల్సి ఉంది. వాటిని చేపట్టకపోవడంతో రెగ్యులేటర్ ద్వారా దిగువ ప్రాంతానికి సరఫరా చేయాల్సిన నీటిని కత్వాకానుల నుంచి ఇవ్వాలి వస్తోంది.