- పెరుగుతున్న దేశీయ పర్యాటకం
- స్వదేశీ పర్యాటకుల సంఖ్య 84.2 శాతానికి పెరిగింది.
- అంతర్జాతీయ సందర్శకుల కంటే 10 రెట్లు అధికం
- దిల్లీ తర్వాత స్థానంలో హైదరాబాదే..
పర్యాటకం మారుతోంది. సంపన్న వర్గాలే కాకుండా.. మధ్యతరగతి వారూ పర్యటనల జోరు పెంచారు. ఏడాదిలో ఒక్కసారి అలా కొత్త ప్రదేశాలను తిలకించి వద్దామనే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. విదేశాలకు వెళ్లే స్థోమత లేనివారే ఎక్కువమంది ఉండడం వల్ల కూడా స్వదేశీ పర్యాటకానికి ఊపొచ్చిందని ట్రావెల్ మ్యాగజైన్ పేర్కొంది. వ్యాపారం, విద్యం, వైద్యం, కార్యాలయ విధులు, ఉపాధి.. ఇలా అనేక అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి.
ఊపు ఇలా.. : 2015తో పోల్చుకుంటే.. 15.5 శాతం స్వదేశీ పర్యాటకులు పెరిగితే.. 2017 నాటికి ఈ శాతం 19.02కి పెరిగింది. ఇలా స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడంలో తమిళనాడు 25.4 శాతంతో ముందుండగా.. ఉత్తరప్రదేశ్ 14.02 శాతంతో రెండో స్థానంలో ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ తర్వాత వరసలో ఉన్నాయి. ఇలా ప్రధానమైన 10 రాష్ట్రాల్లో స్వదేశీ పర్యాటకుల సంఖ్య 2015లో 83.62 శాతం ఉండగా 2016 నాటికి 84.2 శాతానికి పెరిగింది.
తెలంగాణకి వస్తే అనాదిగా హైదరాబాద్‌దే అగ్రస్థానంగా ఉంది. ఇటీవల వరంగల్ రెండో స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర పర్యాటక అధికారులు పేర్కొన్నారు. చారిత్రక కట్టడాలున్న నగరాల్లో రెండో స్థానంలో వరంగల్ ఉండడంతో విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీయుల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. ఇక్కడి కాకతీయ కట్టడాలతో పాటు వేయి స్తంభాల గుడి, లక్నవరం చెరువు వీరిని ఆకట్టుకుంటున్నాయి. వైద్య రంగంలో వచ్చేవారి తాకిడి విషయంలో ముంబయి, దిల్లీ తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉంది.