బిహార్‌లో సంచలనం సృష్టిస్తున్న వసతి గృహంలోని అమ్మాయిలపై అత్యాచార ఘటనపై కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఆ ఎట్టకేలకు పెదవివిప్పారు. అమ్మాయిలపై అత్యాచారాల ఘటన తమ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని, ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హెచ్చరించారు.‘ముజఫర్‌పుర్‌లో జరిగిన ఘటనతో సిగ్గుపడుతున్నాం. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తాం. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. దీన్ని హైకోర్టు కూడా పర్యవేక్షించాలి. ఈ కేసులో రాజీ పడే ప్రసక్తే లేదు. నిందితులను కఠినంగా శిక్షిస్తాం’ అని నితీశ్ హామీ ఇచ్చారు.గత నెల ముజఫర్‌పుర్‌లో వెలుగుచూసిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ముజఫర్‌పుర్‌లో ప్రభుత్వ నిధులతో నడుస్తున్న వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న 40 మందికి పైగా యువతులపై అత్యాచారం జరిగిందని, ఒక అమ్మాయిని కొట్టి చంపేసి పాతిపెట్టేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన పోలీసులు వసతి గృహం ఆవరణలో తవ్వి చూశారు. అమ్మాయిలకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. 34 మందిపై లైంగికదాడి జరిగిందని నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఇప్పటివరకు పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. మరోవైపు ఘటన నేపథ్యంలో బిహార్ ప్రభుత్వంపై అక్కడి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో బంద్ చేపట్టాయి.