పాకిస్థాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ఖాన్‌కు అక్కడి అవినీతి వ్యతిరేక విభాగం ప్రభుత్వ హెలికాప్టర్‌ను దుర్వినియోగం చేశారని, దాని వల్ల ఖైబర్ ఫంక్తువా ప్రావిన్స్ ఖజానాకు రూ.2.17మిలియన్ల నష్టం కలిగిందనే ఆరోపణలతో ఇమ్రాన్‌కు సమన్లు పంపినట్లు ఓ మీడియా నివేదికలో వెల్లడించింది. పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ అయిన 65ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌ను ఆగస్టు 7వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) సమన్లు పంపించింది.ఖాన్ పార్టీ అయిన పీటీఐ 2013 నుంచి ఖైబర్ ఫంక్తువా ప్రావిన్స్‌లో అధికారంలో ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రావిన్స్‌కు చెందిన ప్రభుత్వ హెలికాప్టర్‌ను 72 గంటల పాటు ఉపయోగించుకోవడం వల్ల ఖజానాకు రూ.2.17 మిలియన్ల నష్టం కలగడంపై ఎన్‌ఏబీ దర్యాప్తు జరుపుతోందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. గతంలో ఎన్‌ఏబీ జులై 18వ తేదీకి ఇమ్రాన్‌కు సమన్లు పంపింది. కానీ ఎన్నికల కారణాలతో ఆయన ఎన్‌ఏబీ ప్యానెల్ ఎదుట హాజరుకాలేదు. ఎన్నికల తర్వాత తేదీ ఖరారు చేయాలని ఖాన్ తరఫు న్యాయవాది కోరడంతో ఎన్‌ఏబీ ఈ తేదీని ఆగస్టు 7కు మార్చింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆగస్టు 11న ఇమ్రాన్ పాక్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.