ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ లో అనేక జాతీయ ప్రాజెక్ట్ లు అటకెక్కాయి... అప్పటికే జరుగుతున్న కొన్ని ప్రాజెక్ట్ లు మందగించాయి. ఇక, అమరావతిలో ముఖ్య పాత్ర పోషించే బెజవాడ సంగతి అయితే చెప్పే పనే లేదు. నగరానికి అత్యవసరమైన జాతీయ రహదారి ప్రాజెక్టుల విషయంలో అంతులేని జాప్యం నడుస్తోంది. భారీ వాహనాలు నగరం బయట నుంచే వెళ్లేందుకు రెండు జాతీయ రహదారులను విజయవాడ వెలుపలే అనుసంధానం చేసే విజయవాడ-గుండుగొలను ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. నగరంలో అంతర్గత ట్రాఫిక్ సమస్యలు తగ్గించటానికి బెంజిసర్కిల్ రెండో వరుస ఫ్లై ఓవర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కేంద్రం తాత్సారం చేయటం, అనుమతుల్లో తీవ్ర జాప్యం చేస్తోంది.బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ ప్రాజెక్టు అసంపూర్ణంగా ఉంది. ఒక వరస ఫ్లైఓవర్‌తోనే సరిపెట్టుకోవాలా? అన్నది ఇప్పుడు బెజవాడ ప్రజల మదిని తొలిచేస్తోంది. మొదటగా సెంట్రల్ డివైడర్ స్థానంలో నాలుగువరసల ఫ్లైఓవర్‌గా దీనిని నిర్మించాల్సి ఉంది. బెంజిసర్కిల్‌తోపాటు, విజయవాడ అందం దెబ్బతినకుండా ఉండటానికి రెండు వేర్వేరు ఫ్లై ఓవర్లుగా చెరో మూడు వరుసలతో మొత్తం అరు వరసల సదుపాయంతో కూడిన ప్రాజెక్టు సాకారం చేయాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. దీనికి కేంద్రం సహకరించింది. మొదటి వరస ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు సంబంధించి సహకారం బాగానే అందించింది. ఫ్లై ఓవర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండో వైపున ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.110 కోట్ల వ్యయంతో అంచనాలు కేంద్రానికి పంపి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అతీగతీలేదు. దీనిపై ప్రతిష్ఠంభన నెలకొంది.
కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సవరింపులు చేసినా.. ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈకోణంలో చూస్తే విజయవాడ-గుండుగొలను, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌లు ఉన్నాయి. దీంతోపాటు కనకదుర్గా ఫ్లైఓవర్ విషయంలో కూడా కేంద్రం నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో కృష్ణాకెనాల్ నుంచి సబ్‌వేలకు అప్రోచ్ మార్గాన్ని వాల్‌తో కాకుండా పిల్లర్లు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన రాష్ట్రప్రభుత్వం నుంచి వచ్చింది. ఈ ప్రతిపాదనను కేంద్రం అంగీకరించలేదు. ఫలితంగా రాష్ట్రప్రభుత్వం దీనికి అయ్యే వ్యయాన్ని భరించాల్సి వస్తోంది. ఇక గన్నవరం ఎయిర్ పోర్ట్ సంగతి కూడా అలాగే ఉంది. ఇప్పటి వరకు ఎక్కడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ల జాడ లేదు..