తొలి టెస్టులో టీమ్‌ఇండియాను విజయం ఊరిస్తోంది. కానీ సాధించాలంటే కష్టపడాల్సిందే. లంచ్ బ్రేక్ అనంతరం 31వ ఓవర్‌లో మిగిలిన రెండు బంతుల్లో ఇషాంత్ ఆఖరి బంతికి బట్లర్‌ను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ 87 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ భారత్‌ను యువ బ్యాట్స్‌మన్ కర్రాన్ విసిగించాడు. సూపర్ బ్యాటింగ్‌తో భారత్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. టెయిలెండర్ల అండతో అతడు 65 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. 194 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ శుక్రవారం, మూడో రోజు ఆట ముగిసేసమయానికి 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఆరంభంలో స్టువర్ట్ బ్రాడ్ చెలరేగి వరుస ఓవర్లలో విజయ్ (6), ధవన్ (13)లను అవుట్ చేశాడు. కొద్దిసేపటికే రాహుల్ (13)ను స్టోక్స్ అవుట్ చేయగా 46 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. కర్రాన్ వేసిన 20వ ఓవర్‌లో కోహ్లీ ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేసి రివ్యూకు వెళ్లారు అయితే నాటౌట్‌గా తేలడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. కానీ మరోవైపు రహానె (2), అశ్విన్ (13) వికెట్లను త్వరత్వరగానే కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో కోహ్లీకి అండగా దినేశ్ కార్తీక్ క్రీజులో నిలిచి సహకరిస్తుండడం విజయంపై ఆశలు రేకెత్తిస్తోంది.