ఉత్తర తెలంగాణలో పేదలకు పెద్ద దిక్కుగా పేరొందిన ఎంజిఎం ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం పరిస్థితి అధ్వాన్నంగా మారింది. గుండె జబ్బులతోనో, గుండె పోటుకు గురై.. ఈ ఆస్పత్రికి వస్తే ప్రాణాలు గాలిలో దీపంగా మారాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో కార్డియాలజీ వైద్యుల కొరత, పనిచేయని పరికరాలు, అందుబాటులో లేని సర్జరీ సేవలు, పట్టింపు లేని సిబ్బందితో రోగులు అవస్థలు పడుతున్నారు. రోగులకు సూపర్‌స్పెషాలిటి సేవలు అందించాల్సిన ఎంజిఎం ఆస్పత్రిలోని కార్డియాలజీ విభా గం ఉన్న ట్లా..? ఉండి లేన ట్లా..! అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నామమాత్రపు సేవలతో ఈ విభాగం నామ్ కే వాస్త్‌గా మారింది. 2005లో గుండె జబ్బుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు జనరల్ మెడిసిన్ వైద్యులే రోగులకు ఈ చికిత్స అందించారు. కార్డియాలజీ విభాగం పేరుకు గొప్ప ఊరుకు దిబ్బ అన్నచందంగా తయారైంది. గుండె జబ్బుల వ్యాధి గ్రస్తులకు సంబంధిత పరీక్షలకు కావాల్సిన పరికరాలు లేక ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుండె కదలికలను సూచించే ఎలక్ట్రోకార్డియాగ్రామ్(ఈసిజి). గుండె పనితీరును తెలుసుకునేందుకు ట్రేడ్‌మిల్ టెస్ట్(టిఎంటి) చేస్తారు. ఇది గుండెకు సంబంధించి వైద్యంలో ఈ పరీక్ష అత్యంత ముఖ్యమైనది. గుండె రక్తనాళాల ప్రసరణ పనితీరును తెలుసుకునేందుకు గుండె కవటాలు, గుండె గదులు, మధ్య ఉన్న సమస్య తెలుసుకునేందుకు 2-డిఎకొ యంత్రం అవసరం. సిపికె ఎంబి పరీక్ష ఈ విభాగంలో కనుమరుగయ్యాయి. ఈ వైద్య పరీక్ష కీలకమైనదిగా చెప్పవచ్చు ఈసిజి, 2-డిఎకొ పరికరాలు కొరతతో రోగులకు అసంతృప్తికరమైన సేవలు అందుతున్నాయి. గుండె వ్యాధి గ్రస్తులకు కావాల్సిన ముఖ్యమైన పరికరాలేన ట్రేడ్‌మిల్క్ పరికరం, సిపికెఎంబి పరీక్ష పలు సంబంధిత పరీక్షలు ఈ విభాగంలో లేక తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లి చేయించుకునే పరిస్థితి సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలో ఏర్పడడం బాధాకరం.ఆస్పత్రిలో కార్డియో థొరసిక్ సర్జరీ(సిటి) లేకపోవడం గుండె వ్యాధి గ్రస్తులకు శాపంగా మారింది. సిటి లేక గత కొన్ని సంవత్సరాల నుంచి గుండె శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి.తరువాత జనరల్ మెడిసిన్ వైద్యులు లేక ఆరేళ్లకు పైబడి గుండె జబ్బుల సేవలు నిలిచిపోయాయి. నాలుగేళ్ల కిందట కార్డియాలజీ విభాగానికి సేవలందించేందుకు కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతారెడ్డిని నియమించారు. ఆమె సోమ, గురువారాల్లో ఔట్ పేషెంట్లు మిగిలిన రోజుల్లో ఇన్‌పేషెంట్ సేవలందించినట్లు సమాచారం.. ఒకసారి ఆమె ఆస్పత్రికి రాకపోతే రోగుల పరిస్థితి ఆగ మ్యగోచరంగా మారింది.అత్యవసర పరిస్థితుల్లో ఎంజిఎం ఆస్పత్రికి వచ్చే గుండె జబ్బు బాధితుల పరిస్థితి వర్ణనాతీతం. ప్రస్తుతం పనిచేస్తున్న కార్డియాలజీ వైద్యురాలు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో..! వస్తున్నట్లా.. లేనట్లా..! అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్డియాలజీ విభాగం సిబ్బంది కూడా వైద్యురాలు ఎప్పుడు వస్తారో.. రారో తెలియని పరిస్థితి నెలకొంది. వచ్చినా ఆ వైద్యురాలు మధ్యాహ్నం వరకే అందుబాటులో ఉంటారు. ఆ తరువాత అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు పిజి వైద్యులే దిక్కవుతున్నారు. క్యాజువాలిటీలో సీనియర్ వైద్యులు లేని పరిస్థితులలో పిజి వైద్యులు రోగులను పరీక్షించి పరిస్థితిని ఫోన్‌లో వైద్యులకు వివరించి వైద్యం అందించే దుస్థితి ఏర్పడింది. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో రోగి సీరియస్ పరిస్థితులో ఉన్నప్పుడు అడ్మిట్ చేసుకున్నప్పుడు మరోరోజున ఉదయం కార్డియాలజీ వైద్యురాలు వచ్చిన తరువాతే రోగులకు సేవలు. ఒకవేళ రాని ఎడల గుండెపోటుతో వచ్చిన రోగికి గుండె ఆగినట్లే అని రోగులు వాపోతున్నారు.ఆస్పత్రిలోని గుండె సంబంధిత సర్జరీ పరికరాలు లేక నిర్వీర్యమైపోతున్నాయి. ఆపరేషన్లు అవసరమైన రోగులకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి.గుండె జబ్బుల బాధితులు కార్డియాలజీ విభాగానికి చెందిన ఓ వైద్యాధికారి కార్డియాలజీ సిబ్బందిలో ఒకరిని నియమించుకొని తమ సంబంధిత ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ వైద్యుల కొరత ఉందని రోగి పరిస్థితి విషమంగా ఉందని రోగికి ఏమైతే జరిగితే పరిస్థితి ఏంటని రోగి బంధువులను భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తుంది. ఆరోగ్యశ్రీలో కూడా ఈ వ్యాధి వస్తుందని నమ్మబలికించి కార్డియాలజీ కేసులు తమ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.