ప్రత్యర్థిని దెబ్బ తీయాలంటే పక్కా వ్యూహం అవసరం. అందుకు అంతర్గత కలహాలతో ప్రతిపక్షాలు కిందా మీదా పడుతూ కూటమిని జతకడుతున్నాయి. ప్రత్యర్థిని ఓడించడం అంత తేలిక కాదు అందునా మోడీ లాంటి నేతను ప్రధాని పీఠం నుంచి కిందకు దింపి ఇంటికి పంపటం అంత తేలికైన విషయం కాదు. మోడీని దెబ్బ తీయాలన్న ఆలోచన అయితే ఉంది కానీ.. ప్రధాని కుర్చీ మీద ఉన్న ఆశ మోడీ ప్రత్యర్థులకు పెద్ద బలహీనంగా మారింది.మోడీని ప్రధాని పదవి నుంచి దించేయాలన్న తపన ఉంది కానీ.. అదే సమయంలో పీఎం కుర్చీ మీద ఉన్న ఆశ.. విపక్షాల్ని ఒక తాటి మీద ఉండేలా చేయలేకపోతోంది. ఓపక్క దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్నా.. బీజేపీని సింగిల్ హ్యాండ్ తో ఓడించే సత్తా దేశంలో మరే రాజకీయ పార్టీకి లేదన్నది నిజం. ఇలాంటి వేళలో.. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కలిసి కట్టుగా కృషి చేస్తే అధికారాన్ని అందుకోవటం అంత కష్టమైన విషయం కాదన్న మాట వినిపిస్తూ ఉన్నా.. ప్రధాని పదవి మీద ఉన్న ఆశ వారి ఆశయాన్ని నీరుకార్చేలా చేస్తోంది.మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒక కూటమిలా వివిధ పార్టీల్ని కూడగడుతోంది. కూటమిలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే తాను ప్రధానమంత్రి పదవిని చేపడతానని రాహుల్ గాంధీ స్పష్టం చేస్తున్నారు. అయితే.. తన మాట కారణంగా కాంగ్రెస్ కూటమిగా ఏర్పడేందుకు అవరోధంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించిన రాహుల్.. ఆర్ ఎస్ ఎస్ మద్దతు ఇచ్చే బీజేపీ నేతలు.. మోడీ మినహా ఎవరు ప్రధాని పదవి చేపట్టినా తనకు సమ్మతమేనన్న మాట రాహుల్ నోట నుంచి రావటంతో జాతీయ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తావిచ్చేలా చేసింది.అప్పటి నుంచి ప్రధాని పదవి కోసం బీఎస్పీ అధినేత్రి మాయావతి.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ .. శరద్ పవార్ తో సహా పలువురు నేతలు ఆ కుర్చీ మీద ఆశలు పెంచుకున్నారు. ఇదికాస్తా కూటమి ఏర్పాటుకు అవరోధంగా మారటంతో కొత్త మాటను తెర మీదకుతెచ్చారు. ముందు మోడీని ప్రధాని కుర్చీ నుంచి కిందకు దించుదాం.. ఆ తర్వాత పీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలో నిర్ణయిద్దామన్న మాట మీదకు వచ్చారు.మోడీని అధికారం నుంచి దూరం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న విపక్షాలు మోడీ హఠావో నినాదాన్ని మరింత బలంగా తీసుకొచ్చేందుకు వీలుగా కశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తమ పార్టీ పరిధి చిన్నదే అయినా.. విపక్షాల ఐక్యత కోసం ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలను ఒక్క తాటి మీదకు తెచ్చేందుకు ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు. విపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ వెన్నుముకగా మారాలని ఒమర్ భావిస్తున్నారు.మోడీ ప్రభ తగ్గుతూ.. కాంగ్రెస్ పుంజుకుంటున్న వేళ.. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటి మీదకు వస్తే.. మోడీని దించటం పెద్ద విషయం కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బ తీస్తున్న ప్రధాని కుర్చీ ఆశపై ఇప్పుడు చర్చించుకునే కన్నా. ముందు కలిసి కట్టుగా మోడీని ఓడించి.. ఆ తర్వాత పీఎం పదవి పైన దృష్టి సారిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విపక్షాలకు పెద్దన్నలా నిలుస్తామని.. తమకు అధికారం కంటే కూడా మోడీ ఓటమే తమకు ముఖ్యమన్న విషయాన్ని కాంగ్రెస్ ఇప్పటికే క్లియర్ చేసింది. మాటల్లోకాకుండా కర్ణాటకలో ఆ విషయాన్ని చేతల్లో నిరూపించింది కూడా. విపక్షాలు డైవర్ట్ కాకుండా.. అందరిని ఒక తాటి మీద నిలబడేలా చేస్తున్న రాహుల్ ప్రయత్నాలకు ఒమర్ మరింత చేయూతను ఇవ్వటం చూస్తే.. రానున్న రోజుల్లో మోడీకి కష్టకాలం ఖాయమన్న మాట వినిపిస్తోంది.