YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ వ్యక్తిగత స్వార్థం వల్లే కేంద్రం చిన్నచూపు

టీడీపీ వ్యక్తిగత స్వార్థం వల్లే  కేంద్రం చిన్నచూపు

- అందుకే బడ్జెట్ కేటాయింపులో ఎక్కడా ఏపీ ఊసే లేదు

- భారత చరిత్రలో చంద్రబాబుది చేతకాని ప్రభుత్వం

- కేంద్రం కన్నా టీడీపీ సర్కారే ముందు నోరు జారింది: బొత్స

 కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు స్వార్థపూరిత ఆలోచనల వల్లే రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలోనూ కేంద్రం కంటే ముందే టీడీపీ సర్కార్‌ నోరు జారిందని ఆయన విమర్శించారు.

‘చంద్రబాబుది అంతా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌... ముందుకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఏపీని కేంద్రం ఎందుకు చిన్నచూపు చూస్తోంది. చంద్రబాబుకి జరిగే పరిణామాలు అన్ని ముందే తెలుస్తున్నాయి. కానీ ఏమీ తెలియనట్లు ప్రజలను మభ్యపెడుతున్నారు. ముడుపులు, లంచాలు, దోపిడీల కోసం రాష్ట్రానికి అన్యాయం జరిగినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షంగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేశాం. ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వేజోన్‌ ఏపీ ప్రజల కోరిక. వాటి కోసం చంద్రబాబు కేంద్రంతో ఎందుకు పోరాడటం లేదు. భారత చరిత్రలో చంద్రబాబుది చేతకాని ప్రభుత్వం అందుకే బడ్జెట్‌ కేటాయింపులో ఎక్కడా ఏపీ ఊసే లేదు.’ అని బొత్స అన్నారు.

కేంద్రం ఏం చేస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలోను చంద్రబాబు నైజం బయటపడిందని, కమీషన్లు, ఆర్థిక ప్రయోజనాల కోసమే రాష్ట్ర హక్కుల్ని కాలరాశారని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు అయిపోయాయని, ఇది ఐదో బడ్జెట్‌ అని... ప్రతిసారి కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగినా, ఇప్పటివరకూ టీడీపీ సర్కార్‌ ఎందుకు స్పందించలేదని బొత్స సూటిగా ప్రశ్నించారు. టీడీపీ సర్కార్‌ దోబూచులాట ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. టీడీపీ వ్యక్తిగత స్వార్థం వల్లే ఏపీని కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు.

Related Posts