- మా తాతల నుండీ గిట్లనే తింటున్నం
- చిరుధాన్యాలతో సమృద్ది పోషకాహారం..కలెక్టర్ దివ్య
” జొన్న రొట్టెలు తిని రోజంతా పొలం పనులు అలసి పోకుండా చేసుకునేటోళ్లం. కొర్రగంజి తాగి దుప్పటి కప్పుకొని పడుకుంటే ఎలాంటి జ్వరమైనా తగ్గిపోయేది, తెల్ల బువ్వ వచ్చినంక అవన్నీ మరిచి పోయినం. ఇపుడు నా మనవరాలికి అంగన్‌వాడీలో కొర్రల బువ్వ పెడుతున్నారంటే సంతోషంగా ఉంది.”
కలెక్టర్‌తో సహా అందరూ నేలమీదే కూర్చున్నారు. గ్రామసభ జరుగుతోంది. పెద్ద వయస్సున్న వారు కూడా నేల మీద గంటల తరబడి కూర్చొని ఉత్సాహంగా తమ సమస్యలు చెప్పుకున్నారు. మీటింగ్ ఆయ్యాక అందరూ లేచి నిలబడడానికి ప్రయత్నిస్తున్నారు … 80 ఏళ్లున్న వృద్దులు మెరుపులా లేచి నిలబడి లేవలేని వారికి చేయి అందిస్తున్నారు.ఆ వయసులో కూడా వారిలో చెక్కు చెదరని పటుత్వం కలెక్టర్ గారిని ఆశ్చర్య పరిచింది. వారి ఆహారపు అలవాట్లు గురించి అడిగారు ‘జొన్న రొట్టెలు,కొర్రల బువ్వ…కూరగాయలు.. మా తాతల నుండీ గిట్లనే తింటున్నం ‘అన్నారా పెద్దలు.
అప్పటి నుండీ ఆ కలెక్టరమ్మ చేతిలోకి అంబలి బాటిల్ వచ్చింది. అంతేకాదు తెల్లన్నం తినే తెలంగాణ బిడ్డలకు చిరుధాన్యాలతో పోషకాహారం అందిస్తే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని అప్పటికపుడే ‘చిన్నారులకు చిరుధాన్యాలు’ అనే పథకం రూపొందించి 45 అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు జొన్న ఉప్మా,కొర్రల కిచిడీ తయారు చేసి పిల్లలకు అందిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ వినూత్నంగా ప్రారంభించిన ఈ పథకం వల్ల చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించడమే కాక మిల్లెట్స్ పండించే రైతులకు గిట్టుబాటు ధర వస్తోంది. రోజూ పిల్లలకు మిల్లెట్స్ ఆహారం ఇవ్వడానికి అదనంగా ఒకరూపాయి అరవై పైసలవుతోంది. వివిధ శాఖల సమన్వయంతో నిధులు సమకూర్చుకొని అపుడే పుట్టిన బిడ్డ నుండి ఆరేళ్ల పిల్లల వరకు చిరుధాన్యాలతో సమృద్ది పోషకాహారాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో కలెక్టర్ దివ్య కృషి చేస్తున్నారు.