సంక్షేమ పథకాల అమలులో ఏపీ ప్రభుత్వం మరో అడుగు వేసింది. కొత్తగా ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా వారున్న గ్రామంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో ప్రజలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముందుగా చేయించుకోవాల్సి ఉంటోంది. ఆ పరీక్షల్లో వ్యాధి ఉందని తేలితే ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో వైద్య చికిత్సలు చేయించుకోవచ్చు. ఈ పథకంలో 1044 వ్యాధులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. రోగికి సోకిన వ్యాధి వీటిల్లో లేని పక్షంలో ఆరోగ్యరక్ష పథకంలో చికిత్స అందిస్తారు. కాగా వ్యాధి నిర్ధారణ పరీక్షలకే పెద్ద ఎత్తున ఖర్చవుతుండటంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. కొత్త పథకం అమలుకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఇక వైద్య సేవ పథకంలో లేని వ్యాధులకు చికిత్స అందించడానికి ఆరోగ్య రక్ష కార్డులను ప్రజలకు అందించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మరో వైపు క్యాన్సర్ వ్యాధి చికిత్స కేంద్రాలు రాష్ట్రంలో ప్రస్తుతం 60 వరకు ఉన్నాయి. వీటి సంఖ్య మరింత పెంచేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సకు వస్తున్న వారిలో ఎక్కువగా గ్రామీణ మహిళలు ఉన్నారని వీరంతా ఎక్కువగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) వ్యాధితో బాధ పడుతున్న వారేనని స్పష్టమవుతోంది.దీనివల్ల వ్యాధి రాక ముందే రోగనివారణ చర్యలు తీసుకోవడం, అప్పటికే వ్యాధి సోకి ఉంటే సదరు రోగిని చికిత్స నిమిత్తం తరలించడానికి ఏర్పాట్లు చేస్తారు. ఈ పథకాన్ని దసరా పండుగ లోపు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రతినెలా ఒక తేదీ నిర్ణయించి ఆయా గ్రామాలకు సంచార వ్యాధి నిర్ధారణ కేంద్రాలు వెళ్లి ప్రాథమిక పరీక్షలైన మూత్ర, రక్త పరీక్షలు నిర్వహిస్తాయి. ఆరోజు గ్రామంలో లేని వారు ఏ రోజైనా మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.
ప్రాథమిక పరీక్షల్లో ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే సదరు రోగిని సమీపంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి ఇతర పరీక్షలు నిర్వహించి వ్యాధి ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకుంటారు.ఆ తరువాత అవసరమైతే ఆ రోగిని ఎన్టీఆర్ వ్యైద్యసేవ, ఆరోగ్యరక్ష పథకాల కింద మెరుగైన వైద్య చికిత్సలకు తరలించడం లేదంటే అవసరమైన మందులు, ఆరోగ్య సలహాలు ఇచ్చి పంపడం వంటి చర్యలు తీసుకోనున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.. సాధారణ రక్తపరీక్షల నుంచి అత్యాధునిక, ఖరీదైన వ్యాధి నిర్ధారణ పరీక్షల వరకు ఉచితంగా చేయనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పథకంలో వ్యాధి ఉన్న వారే కాదు లేని వారు కూడా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ పథకం అమలులోకి వస్తే ప్రజలకు వేల రూపాయల లబ్ది చేకూరుతుందని వారు వెల్లడిస్తున్నారు.. చిన్న వయసులో వివాహాలు, ఎక్కువ కాన్పులు, నెలసరి రుతుక్రమం సమయంలో శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలు ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా వైద్యులు వెల్లడిస్తున్నారు. కొత్త పథకం ప్రజల్లోకి వెళ్లే లోపు క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ఆసుపత్రుల సంఖ్య పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలు వ్యాధి రాక ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని, ఎప్పుడైనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్య విషయంలో ప్రాథమిక సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాలు రక్షించుకోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. కొత్త పథకం పేరు, అమలు తేదీని త్వరలో ప్రభుత్వం ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.