జిల్లాలో గోదావరిలో వరుసగా సంభవించిన బోటు ప్రమాదాల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చినా యంత్రాంగంలో మాత్రం దిద్దుబాటు చర్యలు కానరావడం లేదు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో హామీలు ఇస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి అమలుపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో దేవీపట్నం మండల పరిధిలో నదిలో లాంచీ మునక, ఐ.పోలవరం మండలంలో పశువుల్లంక మొండి వద్ద పడవ బోల్తా పడిన ఘటనల అనంతరం మేలుకున్న ఉన్నతాధికారులు ప్రమాదాల నివారణకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా గోదావరిని దాటే ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట్ల లాంచీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనికితోడు పడవల్లో నదిని దాటే చోట్ల ప్రయాణికులకు తక్షణం లైఫ్‌జాకెట్లు అందజేయాలని నిర్ణయించారు. ఒక్కో రేవులో 30 నుంచి 40 లైఫ్‌జాకెట్లు అందుబాటులో ఉంచి పడవల్లో ప్రయాణించే వారు విధిగా వీటిని ధరించేలా చర్యలు చేపడతామని ఉన్నతాధికారులు పేర్కొన్నా అది కార్యరూపం దాల్చడం లేదు.
జిల్లాలో ప్రధానంగా లంక గ్రామాలతో పాటు ఇతర చోట్ల ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలోనే స్థానికులు పడవల్లో గోదావరిని దాటుతున్నారు. ప్రధానంగా విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే విద్యార్థులు విధిగా పడవల్లో గోదావరిని దాటాల్సి ఉంది. వివిధ రేవుల్లో లైఫ్‌జాకెట్ల ఊసేలేక పోగా కొన్ని చోట్ల వీటిని అరకొరగా అందజేశారు. దీనికితోడు రేవుల వద్ద సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఉన్న లైఫ్‌జాకెట్లను కూడా వినియోగించడం లేదు. జిల్లా వ్యాప్తంగా లంక గ్రామాల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు గోదావరిని దాటి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తుంటారు. తమ పిల్లలను బాగా చదివించాలన్న సంకల్పంతో తల్లిదండ్రులు ప్రమాదకర పరిస్థితుల్లోనే పడవల్లో పంపుతున్నారు. గోదావరి రేవుల్లో నాటు పడవలు, బోట్లు నడిపే చోట పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించినా ఆచరణలో కానరావడం లేదు.ఉన్న లైఫ్‌జాకెట్లను అయినా ప్రయాణికులు వినియోగించేలా చూడాల్సిన వారు కరవయ్యారు. దీంతో కొన్ని చోట్ల లైఫ్‌జాకెట్లు నాటు పడవల్లో అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. లైఫ్‌జాకెట్లు అందజేయడంతో పాటు ప్రమాదం జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై కూడా అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ దిశగా కూడా చర్యలు కానరావడం లేదు. ఈ పరిస్థితిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు చేపట్టి లంక గ్రామాల రేవులతో పాటు నదిని దాటే ఇతర ప్రాంతాల్లో తక్షణం లైఫ్‌జాకెట్లను అందుబాటులో ఉంచాల్సిన అవసరముంది. దీనికితోడు ఇక్కడ పడవల్లో ప్రయాణించే వారు విధిగా లైఫ్‌జాకెట్లు ధరించేలా పర్యవేక్షణకు సిబ్బంది నియామకాన్ని కూడా చేపట్టాల్సి ఉంది.