YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నల్లారి ఫోన్లకు దిక్కేది...

 నల్లారి ఫోన్లకు దిక్కేది...
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన పార్టీలో చేరిక సందర్భంగా మరో ముప్ఫయి మంది నేతలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలాగే పార్టీలో చేరినప్పటి నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొందరు నేతలకు ఫోన్లు చేసి మరీ ‘‘ఒకసారి కలుద్దాం రాకూడదూ’’ అంటూ ఆహ్వానాలు కూడా పంపుతున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు ఇప్పటి వరకూ ఏ నేత ముందుకు రాకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత జిల్లాలోనే నేతలను ప్రభావం చేయలేక పోయారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరు. నల్లారి కుటుంబానికి ఆ జిల్లాలోమంచి పట్టుంది. కిరణ్ తండ్రి అమర్ నాధ్ రెడ్డి జిల్లా రాజకీయాలను మూడు దశాబ్దాలు ప్రభావితం చేశారు. ఆయన ఇందిరాగాంధీకి వీరవిధేయుడిగా ఉండేవారు. అమర్ నాధ్ రెడ్డి మరణం తర్వాత కిరణ్ వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా మెలిగారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేసేవారు. కాని వైఎస్ కిరణ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వైఎస్ మరణంతో కిరణ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ రాష్ట్ర విభజన తర్వాత సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టిన కిరణ్ ఆ ఎన్నికలలో డిపాజిట్లు దక్కక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీని పక్కన పెట్టేశారు. అదే కిరణ్ కొంప ముంచిందంటున్నారు.అయితే ఈ నాలుగేళ్లలో కిరణ్ వర్గానికి చెందిన నేతలకు ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇటీవలే ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. కిషోర్ కుమార్ రెడ్డితో పాటు ఆయన అనుచరగణం మొత్తం తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయింది. కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో రెండుసార్లు పర్యటించి వచ్చారు కూడా. నాలుగేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండటమే కిరణ్ చేసిన అది పెద్ద తప్పు అని ఇప్పుడు ఆయనకు తెలిసి వస్తోంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆయన సొంత జిల్లాలో ఆయన వెంట నడిచేవారే కరువయ్యారు. తన వెంట నడిచి వస్తారనుకున్న నేతలు కూడా తమ్ముడు వెంట తిరుగుతుండటం ఆయనకు నిజంగా షాకిచ్చే అంశమే.అన్ని జిల్లాల్లో మాదిరిగానే చిత్తూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ కోమాలోకి వెళ్లిపోయింది. నాలుగేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండలేక నేతలు కొందరు వైసీపీకి మరికొందరు టీడీపీలోకి వెళ్లిపోయారు. మరోసారి జెండా మార్చటం తమ వల్ల కాదంటున్నారు కిరణ్ వర్గం నేతలు. చిత్తూరు జిల్లాలో మాజీ ఎంపీ చింతామోహన్ తప్ప చెప్పుకోదగ్గ నేత ఎవరూ లేరు. కిరణ్ ను నమ్ముకుని తిరిగి కాంగ్రెస్ లోకి వెళితే తమకు భవిష్యత్ ఉండదని భావించిన కిరణ్ వర్గీయులు కిషోర్ కుమార్ రెడ్డి వెంటే ఉండాలని నిర్ణయించుకున్నారు. సో….కిరణ్ తన సొంత జిల్లాలోనే ప్రభావం చూపలేకపోయారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Related Posts