ఏలాగైతేనేమి కేంద్రం లో బిజెపి మోడి ప్రభుత్వాన్ని దింపాలి ఇది ప్రతిపక్షాల వ్యూహం.ఐతే రాబోయే ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకోవడమే కాకుండా...ప్రధానమంత్రి పదవి గురించి కూడా ఇప్పటినుంచే కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం జీర్ణించుకోలేని వార్త తెరమీదకు వచ్చింది. ప్రతిపక్షాల కూటమిలోని కీలక పార్టీ నాయకుడు సంచలన ప్రతిపాదన పెట్టారు. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని నిర్ణయిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవెగౌడ తెలిపారు. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేశారని మళ్లీ ఇప్పుడు ఓ మహిళ ప్రధాని అయితే తప్పేంటని ప్రశ్నించారు. ఆ మహిళ మమతాగానీ మాయవతిగానీ ఎవరైనాగానీ ఓ మహిళ ప్రధాని కావడంలో తప్పులేదని చెప్పారు. ముందుగా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేయాలని ప్రధాని అభ్యర్థిని ఎన్నికల తర్వాత నిర్ణయిద్దామని కాంగ్రెస్ ఆలోచిస్తున్న నేపథ్యంలో దేవేగౌడ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.