సోమవారం ఉదయం టిడిపి ఎంపిలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపిలు, మంత్రులు, పార్టీ బాధ్యులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు చివరి వారానికి చేరాయి. ఈ వారం రోజులు మన పోరాటంలో కీలకం. ఎంపిలు పోరాటాన్ని ముమ్మరం చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇదే స్ఫూర్తితో పోరాడాలి.విశాఖ రైల్వే జోన్ పై ఉత్తరాంధ్ర ఎంపిలు పోరాటం ఉధృతం చేయాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి. కడప స్టీల్ పై రాయలసీమ ఎంపిలు పోరాడాలి. ఉక్కు సంకల్పంతో కడప ఉక్కును సాధించాలి. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకోవడంపై నిలదీయాలని అన్నారు. ఖాతాలో వేసిన నిధులు వెనక్కి తీసుకోవడం ఎప్పుడైనా జరిగిందా అని అయన ప్రశ్నించారు. నిధులు వెనక్కి తీసుకోవడం చాలా తీవ్రమైన అంశం.టిడిపి ఎంపిలు దీనిపై సభలో తీవ్రంగా ప్రతిఘటించాలి. సెషన్స్ ముగిసే ముందురోజు మన ఎంపిలు రాష్ట్రపతిని కలిసి వివరించాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయం రాష్ట్రపతి దృష్టికి నివేదించాలి.5కోట్ల ప్రజల హక్కులను కాలరాయడంపై రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఫ్లోర్ లీడర్లతో సంప్రదింపులు జరపాలి.ఇకపై కూడా అన్ని పార్టీల సహకారం తీసుకోవాలి. అటు సభలో పోరాటం,ఆ తరువాత క్షేత్రస్థాయిలో పోరాటం ముమ్మరం చేయాలి. ఏపి పునర్వవస్థీకరణ చట్టం అమలు చేయించాల్సిన బాధ్యత ఎంపిలదేనని అన్నారు. అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరేలా చూడాల్సిన బాధ్యత పార్లమెంటుదే అని చంద్రబాబు స్పష్టం చేసారు.