విశాఖ రైల్వే జోన్ అటు టీడీపీకి, ఇటు బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ట్రంప్ కార్డుగా మారబోతోంది. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని బీజేపీ, తానే తెస్తానని విశాఖ ఎంపీ హరిబాబు పదే పదే చెబుతున్నారు. రైల్వే జోన్ తెచ్చిన పార్టీకి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పడతారన్నది రాజకీయ పార్టీల్లో ఉంది. జోన్ విషయాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ కేవలం హోదాపైనే ఆధారపడి ఎన్నికలకు వెళుతోంది. అయితే, టీడీపీ కొద్ది రోజులుగా హోదా అంశాన్ని పక్కన పెట్టి, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు వంటి అంశాలపై గొంతు పెంచుతోంది.రైల్వే జోన్‌పై త్వరగా ప్రకటన చేయాలని స్థానిక బీజేపీ నాయకులు కేంద్రంపై పదే పదే వత్తిడి తెస్తున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజ్యసభలో మాట్లాడుతూ విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో విశాఖకు చెందిన బీజేపీ నాయకులంతా ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను ఘనంగా సత్కరించి, జోన్ కూతను వీలైనంత త్వరగా వినిపించమని విజ్ఞప్తి చేశారు. అయితే, రైల్వే జోన్ అనేది ట్రంప్ కార్డు అని, దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వాడుకుందామని బీజేపీ పెద్దలు వీరికి చెప్పి పంపించారు.
రైల్వే జోన్ ఎక్కడ బీజేపీ ఖాతాలో పడిపోతుందోనన్న భయంతో టీడీపీ కూడా ఓ ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి ఢిల్లీ వెళ్లి, పీయూష్ గోయల్‌ను కలవనున్నారు. జోన్ కోసం కేంద్రంపై వత్తిడి పెంచడం ఈ పర్యటన ఆంతర్యమని టీడీపీ నేతలు చెబుతున్నారు.రైల్వే జోన్ గురించి పార్లమెంట్‌లో ఇప్పటికే ఎంపీ అవంతి శ్రీనివాసరావు పలు దఫాలుగా మాట్లాడారు. ఈనెల 12తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఒకవేళ ఈ సమావేశాల్లోనే జోన్‌పై ప్రకటన వెలువడితే, బీజేపీ బలపడుతుంది. ఈలోగా టీడీపీ బృందం కూడా ఒకసారి ఢిల్లీ పెద్దల్ని కలిస్తే, ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది.