పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నిస్తున్న జగన్ చరిత్ర హీనుడుగా మారిపోతారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత జగన్ అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాసుల కక్కుర్తితో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసిన సంగతి జగన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్తారో? ఆయనకు చెందిన రూ.40వేల కోట్లకు పైగా ఆస్తులను ఈడీ ఎందుకు జప్తు చేసిందో? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పట్టిసీమ ద్వారా గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు ఈ నాలుగేళ్లలో 187 టీఎంసీల నీరు మళ్లించిన సంగతి ప్రతిపక్ష నేతకు కనబడటం లేదని ఉమ విమర్శించారు.