కర్ణాటక రాష్ట్రంలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరో తేల్చిచెప్పాలని జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడను బీజేపీ ప్రశ్నించింది. ఒక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు సీఎంగా వ్యవహరిస్తున్నారని కర్ణాటక బీజేపీ శాఖ మంగళవారం ట్వీట్ చేసింది. కుమారస్వామి సోదరుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(పీడబ్ల్యూడీ) మంత్రి రేవణ్ణ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ మంత్రుల శాఖల్లో ఆయన కల్పించుకుని పెత్తనం చలాయిస్తున్నారంటూ ట్విటర్‌లో పేర్కొంది. దేవెగౌడ కూడా రాష్ట్ర పరిపాలన వ్యవహరాల్లో తలదూరుస్తున్నారని, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సీఎంలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది. అసలు ప్రస్తుత సీఎం ఎవరంటూ చమత్కనరించింది.‘అనేక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచుస్తున్నారు. అసలు మీలో ఎవరు సీఎం అని ప్రజలకు సందేహంగా ఉంది. ముందు నిజమైన సీఎం ఎవరో తేల్చుకోండి’ అని ట్విట్ చేసింది. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తండ్రి, ఇద్దరు కొడుకులు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, జేడీఎస్‌ని కుటుంబ పార్టీగా బీజేపీ వర్ణించింది. బీజేపీ వ్యాఖ్యలపై జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ విశ్వనాధ్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నేతలు అర్థమంతంగా మాట్లాడాలని హెచ్చరించారు.