YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

అయ్యప్పస్వామి 18 మెట్ల విశిష్టత

అయ్యప్పస్వామి 18 మెట్ల విశిష్టత

 ప్రపంచ సుప్రసిద్ధ ఆలయాల్లో శబరిమల ఒకటి. 41 రోజుల పాటు దీక్షలో ఉన్న భక్తులు ఎన్నో వ్యయప్రయాసలతో.. 18 కొండలు దాటుకుంటూ స్వామివారి సన్నిధానానికి చేరుకుంటారు. అక్కడ 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను ‘పదునెట్టాంపడి’ అని పిలుస్తారు. 41 రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వారికి మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటుంది. సన్నిధానంలోని 18 మెట్లకు నమస్కరిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అలా ఎక్కిన వారికి కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. అంతేకాదు ఆలయంలో స్వామివారు కొలువుదీరిన సందర్భంగా 18 వాయిద్యాలు మోగించారని చెబుతుంటారు.

ఒక్కో మెట్టు.. ఒక్కో విశిష్టత 
స్వామివారిని దర్శించుకోవాలంటే ప్రతి అయ్యప్ప భక్తుడు 18 మెట్లను ఎక్కాల్సిందే. వీటిని గ్రానైట్‌తో నిర్మించారు. వాటికి పంచలోహాలతో పూత పూశారు. తొలుత కుడి కాలు పెట్టి స్వామివారి 18 మెట్లను భక్తులు ఎక్కాల్సి ఉంటుంది.

* స్వామివారి సన్నిధానంలోని తొలి ఐదు మెట్లు మనిషి పంచేంద్రియాలకు సంబంధించినవి. కళ్లు, చెవులు, ముక్కు, జిహ్వ, స్పర్శకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి. 
* తర్వాతి 8 మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవి. కామ, క్రోదం, మోహం, మద, మాత్సర్యం, అసూయ, డాంబికాలు పలకడం వంటి ఒక్కో దాన్ని ఒక్కో మెట్టు సూచిస్తుంది. 
* తర్వాతి మూడు మెట్లు త్రిగుణాలకు సంబంధించినవి. సత్వ, తమో, రజో గుణాలకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి. 
* ఇక చివరి రెండు మెట్లు విద్య, అవిద్య (అజ్ఞానం)ను సూచిస్తాయి.ఎవరైతే ఈ 18 మెట్లను భక్తిభావంతో, గౌరవంతో ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారో వారు శారీరకంగా, మానసికంగా పరిపూర్ణుడవుతాడని భక్తులు నమ్ముతారు. భక్తులు మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా స్వామివారిని చూస్తూ దిగివస్తారు.

ఈ 18 మెట్లకు సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్పస్వామి ఉపయోగించిన 18 ఆయుధాలుగా పేర్కొంటారు. స్వామివారు సన్నిధానంలో విగ్రహ రూపం దాల్చకముందు వాటిని ఒక్కో మెట్టు వద్ద ఉంచారని పేర్కొంటారు. స్వామివారి ఆలయానికి చేరుకోవాలంటే 18 కొండలను కూడా దాటాల్సి ఉంటుంది. ఆ 18 కొండలను ఈ 18 మెట్లు సూచిస్తాయని కూడా చెబుతుంటారు.

18 మెట్లు 18 పురాణాలను సూచిస్తాయని కొందరు చెబుతుంటారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలోనూ 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇలా 18 సంఖ్యకు.. అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లకు సంబంధం ఉందని చెబుతుంటారు.

ఈ 18 మెట్లను ఎవరైతే దాటుకుంటూ వెళతారో వారికి ‘పుణ్యదర్శనం’ లభిస్తుందని ప్రతీతి. అయ్యప్ప మాలధారణలో ఉన్న భక్తులు దీక్షా సమయంలో ఇంట్లో 18 మెట్లను ఏర్పాటు చేసి పడిపూజ నిర్వహిస్తుంటారు.

Related Posts