తెలుగు రాష్ట్రాల ప్రజల్లో భక్తిభావం నింపి ఆయా గ్రామాల్లోని ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆగస్టు 23వ తేదీన శ్రావణపౌర్ణమి సందర్భంగా 12వ విడత ''మనగుడి'' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోల భాస్కర్ వెల్లడించారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో మంగళవారం ఉదయం రాష్ట్ర దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్లతో ధర్మప్రచారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ధర్మ ప్రచారంలో భాగంగా దేవాలయాలలో అర్చకులుగా ఉంటు, ధార్మిక ప్రవచనాలు చేయగలిగే అర్చక స్వాములను దేవాదాయశాఖ ద్వారా గుర్తించి క్షేత్రస్థాయిలో ప్రజలకు సనాతన హైందవ ధర్మంపై అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రాలలో, ప్రముఖ దేవాలయాలలో ఆధ్యాత్మిక గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు టిటిడి ప్రచురణలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ శాఖ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాది ఆలయాల్లో శ్రావణ పౌర్ణమి పర్వదినాన మనగుడి కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మ ప్రచారంలో భాగంగా శుభప్రదం, మనగుడి వంటి ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లా ధర్మప్రచార మండళ్లు బలోపేతం
అనంతరం శ్వేతాలోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా ధర్మప్రచార మండళ్ల సభ్యుల సమావేశంలో తిరుపతి జెఈవో మాట్లాడుతూ జిల్లా ధర్మప్రచార మండళ్లను మరింత బలోపేతం చేసి సంస్థాగతంగా పనిచేసేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న మనగుడి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని ధర్మప్రచార మండలి సభ్యులకు సూచించారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజలను, అర్చకులను, వేద పారాయణందార్లను, భజనమండళ్ల సభ్యులను, శ్రీవారి సేవకులను భాగస్వాములను చేయాలన్నారు.
అంతకుముందు మనగుడి, భజనమండళ్ల బలోపేతం, అర్చక శిక్షణ, గీతాజయంతి, ధర్మాచార్యుల శిక్షణ, శుభప్రదం కార్యక్రమాలపై జిల్లా ధర్మప్రచార మండలి సభ్యుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి రమణప్రసాద్, డెప్యూటీ ఈవోలు హేమచంద్రరెడ్డి, ధనంజయులు, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ప్రభాకర్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి ఆంజినేయులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.