YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరుణానిధి కన్నుమూత...!!

కరుణానిధి కన్నుమూత...!!

దశాబ్దాల తరబడి తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన కరుణానిధి శకం ముగిసింది. మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి మృతి చెందారు. ఆయన వయస్సు 94 ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మూత్రనాళం ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలం ఇంట్లోనే చికిత్స జరిగింది. బీపీ డౌన్ అవ్వడంతో చెన్నై నగరంలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. 11 రోజులుగా ఆయన కావేరి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన హాస్పిటల్ వర్గాలు.. ఆయన తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించాయి. కరుణ మరణవార్తతో తమిళులు శోకసంద్రంలో మునిగిపోయారు. ద్రావిడ రాజకీయాలను శాసించిన కరుణానిధి 1924 జూన్ 3న తంజావూరులోని తిరుక్కువలైలో జన్మించారు. ఆయన చిన్నకుమారుడు స్టాలిన్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు. పెద్ద కుమారుడు అళగిరి కొంతకాలంగా పార్టీకి, కుటుంబానికి దూరంగా వుంటున్నారు. 33 ఏళ్ల వయసులో 1957లో డీఎంకే తరపున కరుణానిధి తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1961లో డీఎంకే ట్రెజరర్ గా, 1962లో ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ గా బాధ్యతలను నెరవేర్చారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 1969లో అన్నాదురై చనిపోయిన తర్వాత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. కరుణానిధి మరణవార్త వినగానే డీఎంకే కార్యకర్తలు, అభిమానులు కావేరి ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు కావేరి ఆస్ప‌త్రి చుట్టూరా మొహ‌రించారు. తమిళనాడులో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కరుణానిధి మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు కరుణానిధి కుటుంబం చుట్టూ, ఆయనకు అభిమానుల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. భారత దేశం .. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఆయన్ని కోల్పోయిందని, కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Related Posts