గుంటూరు జిల్లాల్లో 295 కంకర క్వారీలు, 60 గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. అయితే క్వారీల నిర్వహణలో నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు.క్వారీల్లో బ్లాస్టింగ్ చేసేందుకు అనుమతులతో పాటు నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. బ్లాస్టింగ్ చేసేందుకు లైసెన్స్ ఉండాలి. భూగర్భ గనులశాఖ భద్రత విభాగం ఈ లైసెన్సు జారీ చేస్తుంది. జిలెటిన్ స్టిక్స్ వంటి మందుగుండు సామగ్రిని ఉపయోగించేందుకు, నిల్వ చేసేందుకు ఎక్స్‌ప్లోజివ్ విభాగం నుంచి లైసెన్స్ పొందాలి. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపకశాఖల అనుమతి తీసుకోవాలి. అన్ని అనుమతులుంటేనే మందుగుండు సామాగ్రి నిల్వ చేసేందుకు, బ్లాస్టింగ్ చేసేందుకు అర్హులు. జనావాసాలకు 500 మీటర్ల దూరంలో పేలుళ్ల సామగ్రి ఉండకూడదు. మందుగుండు సామగ్రి నిల్వ ఉన్న ప్రాంతంలో నీటి ట్యాంకు, ఇసుక, గ్యాస్ సిలెండర్లు, 24 గంటల పాటు కాపలాదారులు అందుబాటులో ఉండాలి. బ్లాస్టింగ్ జరిపే వ్యక్తి ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొంది ఉండాలి. అయితే ప్రభుత్వం నుంచి క్వారీ లీజు తీసుకునేటప్పుడు అనుమతులు ఉన్న వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. దస్త్రాల్లో అన్ని అనుమతులు ఉన్నట్లు పక్కాగా చూపిస్తున్నారు. క్వారీ లీజు పొందిన తర్వాత నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. క్వారీ బ్లాసింగ్ విషయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో పరిసర ప్రాంతాలకు చెందినవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ప్రధానంగా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు, ఉప్పరపాలెం గ్రామాల్లో 80కి పైగా కంకర క్వారీలున్నాయి. 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్నా ప్రతిరోజు బ్లాస్టింగ్ నిర్వహిస్తుంటారు. అడిగేవారు లేకపోవడంతో ఇక్కడ ఇష్టారాజ్యంగా మారింది. చిలకలూరిపేట మండలం బొప్పూడి, రాజాపేట, మురికిపూడి తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున కంకర, గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడ కూడా నిబంధనలు పాటించిన పరిస్థితి మచ్చుకైనా కనిపించదు. నాదెండ్ల చలంకొండల్లో పెద్దఎత్తున గ్రానైట్ బండరాళ్లను పేలుస్తున్నారు. జిల్లాలోని పేరేచర్ల, చినపలకలూరు, పెదపలకలూరు, తురకపాలెం, పల్నాడు ప్రాంతంలో పిడుగురాళ్ల, దాచేపల్లి పరిసరాల్లో సున్నపురాయి క్వారీలున్నాయి. పేలుళ్ల ధాటికి పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలకు పగుళ్లిస్తున్నాయి. కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు.ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో బ్లాస్టింగ్ చేయాలని నిబంధనలున్నా ఎక్కడా వేళలు పాటించడం లేదు. బ్లాస్టింగ్ చేసేందుకు నిపుణులైన వారిచేత బ్లాస్టింగ్ చేయాలని ఉన్నప్పటికీ కూలీల చేతనే పని కానిస్తున్నారు. జిల్లాలో ఆరుగురికి మాత్రమే బ్లాస్టింగ్ లైసెన్సులు ఉన్నాయి. వంకాయలపాడు, ఉప్పరపాలెం, బొప్పూడి, కోటప్పకొండ, ఫిరంగిపురం, పేరేచర్ల తదితర ప్రాంతాలలో జనావాసాలకు దగ్గరగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈ కారణంగానే అప్పుడుప్పుడు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ప్రమాదకరమైన మందుగుండు సామగ్రి నిబంధనల మేరకు నిర్మించిన దానిలోనే నిల్వ చేయాలి. కాని చాలాచోట్ల క్వారీ పరిసరాల్లోనే వాటిని ఉంచుతున్నారు. ఈ కారణంగానే కర్నూలు జిల్లాలో మందుగుండు పేలి కూలీలు మృతి చెందినట్లు ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా ప్రమాదాలు జరగకుండా అధికారులు నిబంధనలు అమలు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణం అధికారులు క్వారీల్లో నిబంధనలు అమలవుతున్నాయో లేదో పరిశీలించి కార్మికులతో పాటు నివాశితుల ప్రాణాలు కాపాడాలని జిల్లా వాసులు కోరుతున్నారు.