YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

జమిలీ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాలదీ తలో దారి

జమిలీ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాలదీ తలో దారి

జ‌మిలీ ఎన్నిక‌ల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ జై కొట్టారా! అంటే ఔన‌నే చెప్పాలి. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన గులాబీబాస్‌.. ప్ర‌ధాని మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. పైగా రాజ‌కీయాల గురించి మూడో కూట‌మి.. ప్రాంతీయ‌పార్టీల గురించి చాలాసేపు చ‌ర్చించిన‌ట్లుగానే కేసీఆర్ చెప్పుకొచ్చారు. పైగా.. తాను క‌మ‌లం పార్టీకు ర‌హ‌స్య‌ స్నేహితుడిని అనే సంకేతాన్ని కూడా పంపారు. ఈ లెక్క‌న‌.. ఎన్నిక‌లు.. ఈ ఏడాది డిసెంబ‌రులో ఉండ‌వ‌చ్చంటూ తేల్చిచెప్పారు. దీనికి త‌గిన‌ట్లుగానే ఎన్నిక‌ల సంఘం కూడా.. ఇప్ప‌టికే ఈవీఎంలు.. ఇత‌ర‌త్రా ఏర్పాట్ల‌పై కూడా అధికారుల‌ను ఆదేశించింది. ఉపాద్యాయుల‌ను కూడా వీలైంనంత త్వ‌రిత‌గతిన సిల‌బ‌స్ పూర్తిచేయ‌మంటూ మౌఖిక ఆదేశాలు అందిన‌ట్లు తెలుస్తోంది.ఈ లెక్క‌న‌.. కేసీఆర్ కూడా త‌న లెక్క‌లు తాను వేసుకునే ప‌నిలో ప‌డ్డారు. సెప్టెంబ‌రు చివ‌రి క‌ల్లా.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వే చేసేందుకు ఆదేశించిన‌ట్లు తెలిసింది. దాదాపు 30 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల ప‌నితీరుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లు గుర్తించారు. దానిలో భాగంగానే అక్క‌డ కేసీఆర్ కోట‌రీ ఉన్న‌ నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ప్ర‌త్య‌ర్థి బ‌లంగా ఉన్న‌చోట‌.. న‌యానో.. భ‌యానో దారికి తీసుకురావాలంటూ కూడా సూచించిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి తెలంగాణ స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతున్న మాట‌ వాస్త‌వ‌మే. కోదండ‌రాం మాస్టారు దీనికి ఆజ్యం పోసేలా పార్టీ పెట్ట‌డం.. ఊరూవాడా తిరుగుతూ కేసీఆర్ పాల‌న‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇటువంటి వేళ‌.. ముంద‌స్తుగా మేలుకుంటేనే.. 2019లో ప‌వ‌ర్ చేతికివ‌స్తుంద‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌. అయితే.. ఏపీలో చంద్ర‌బాబు ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గ‌తంలో ముంద‌స్తు ముచ్చ‌ట‌తో చేతులు కాల్చుకున్న సెంటిమెంట్‌తో సారీ అంటూ తేల్చారు.పైగా ముంద‌స్తు జమిలీ టీడీపీకు న‌ష్టం తెస్తుంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇప్ప‌టికే జ‌గ‌న్‌, ప‌వ‌న్‌.. బీజేపీ మూడుపార్టీలూ.. చంద్ర‌బాబును ఒంట‌రివాడిని చేశాయి. కాంగ్రెస్ తో పొత్తును కొంద‌రు తెలుగుదేశం లీడర్స్ అంగీక‌రిస్తుంటే.. సీనియ‌ర్లు మాత్రం ఓడినా స‌ర్లే.. కానీ.. హ‌స్తంతో దోస్తీ వ‌ద్దంటున్నారు. సో.. క‌ల‌సిరాని కాలంతో పాటు.. 49 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల ప‌నితీరు స‌రిగా లేదంటూ నిఘావ‌ర్గాలు నివేదిక ఇచ్చా యి. వీరిలో 40 మంది ఎమ్మెల్యేల‌ను పోటీకు నిలిపితే గెల‌వ‌టం కూడా క‌ష్ట‌మ‌నే వాస్త‌వం కూడా అధినేత‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. దీంతో.. బాబు పోల‌వ‌రం నిర్మాణం, అమ‌రావ‌తి ప‌నులు వేగ‌వంతంగా పూర్త‌య్యాక‌.. జ‌నాల్లోకి కేవ‌లం అభివృద్ధిని చూపి ఓట్లు అడ‌గాల‌నే భావ‌న‌లో ఉన్న‌ట్లుగా పార్టీ వ‌ర్గాలు చెబ‌తున్నాయి. ఈ లెక్క‌న‌.. కేసీఆర్ స‌రే అన్నా.. చంద్ర‌బాబు మాత్రం స‌సేమిరా అంటార‌నేది.. విశ్లేష‌కుల అంచ‌నా. 

Related Posts