భారత్…పాకిస్థాన్…. రెండు దేశాలూ ఒకే సారి ఆవిర్భవించాయి. ఒకేసారి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి. ఒకే రోజు ప్రస్థానాన్ని ప్రారంభించాయి. కానీ రెండు దేశాల మధ్య గల వ్యత్యాసాలు అనంతం. సారూప్యతలు శూన్యం. ఒకే తల్లి బిడ్డలయినప్పటికీ ఎక్కడా పోలిక లేదు. అన్నదమ్ముల్లో ఒకరైన భారత్ ఏడు దశాబ్దాల ప్రస్థానంలో ప్రగతి పథాన పయనిస్తోంది. భిన్నత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. సంపూర్ణ ప్రజాస్వామ్యం, స్వతంత్ర ప్రతిపత్తిగల న్యాయవ్యవస్థ, మైనార్టీలకు ప్రత్యేక రక్షణలతో అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పాక్ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం. భిన్నత్వానికి చోటేలేదు. పేరుకే ప్రజాస్వామ్యం. తెరవెనుక సైన్యానిదే పెత్తనం. అంతర్గత ఘర్షణలతో అంతర్జాతీయంగా అస్ధిర దేశంగా ముద్రపడింది.ఈ అస్థిర దేశాన్ని సుస్థిర దేశంగా తీర్చిదిద్దడం కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కర్తవ్యం. ఏడు పదుల పాక్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఏడు దశాబ్దాల చరిత్రలో ముచ్చటగా మూడుసార్లు రాజ్యాంగాన్ని పూర్తిగా తిరగ రాసుకున్నారు. స్వతంత్ర పాక్ చరిత్రలో తొలిసారి 1956లో రాజ్యాంగం రూపుదిద్దుకుంది. పట్టుమని నాలుగేళ్ల పాటు కూడా ఈ రాజ్యాంగం నిలవలేదు. 1962లో మళ్లీ రాజ్యాంగాన్ని రచించారు. ఈసారి కూడా కాస్త అటుఇటుగా ఇదే పరిస్థితి. 1973లో మళ్లీ కొత్త రాజ్యాంగాన్ని రాసుకున్నారు. రాజ్యాంగాన్ని మూడుసార్లు తిరగరాసుకునేందుకు రాజకీయ కారణాలే తప్ప మరో కారణం కాకపోవడం గమనార్హం. ప్రజాశ్రేయస్సు, సంక్షేమం కోసం మార్చుకుంటే అభ్యంతరం లేదు. కానీ నేతల చిత్తం మేరకే ఈ మార్పు జరిగింది. అదే సమయంలో భారత్ రాజ్యాంగానికి సవరణలు చేసిందే తప్ప మూలాన్ని మార్చలేదు. రెండు దేశాలకూ గల తేడా ఇదే.అన్నింటికన్నా కీలకమైనది ప్రధాని పదవికి పూచిక పుల్లపాటి విలువ కూడా లేకపోవడం. ఏడు దశాబ్దాల చరిత్రలో ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రధాని అయిదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. ప్రజాస్వామ్యం అక్కడ ఇంకా పటిష్టంగా కాకపోవడాన్ని ఈ విషయం ఎత్తి చూపుతుంది. ఎంతటి ప్రజాదరణ గల నేతలు అయినప్పటికీ సైన్యం ముందు బలాదూర్. సైన్యం చెప్పినట్లు వినకపోతే ఏ ప్రధాని పరిస్థితి అయినా ఇంతే సంగతులు. ఈ 70 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రధానులు మారారు. అంటే ఒక్కో ప్రధాని సగటు పదవీకాలం రెండేళ్లకు మించలేదు. ఏడుగురు ప్రధానులను అధ్యక్షుడు బర్త్ రఫ్ చేశారు. ఆరుగురు ప్రధానులను సుప్రీంకోర్టు తొలిగించింది. అయిదుగురు ప్రధానులు అర్థాంతరంగా రాజీనామా చేశారు. ముగ్గురు ప్రధానులు సైనిక కుట్ర కారణంగా పదవులను కోల్పోయారు. ఒక ప్రధాని హత్యకు గురయ్యారు. ఇదీ స్థూలంగా పాక్ ప్రధానుల చరిత్ర.ఇక ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. రెండేళ్లు అధ్యక్షుడిగా, నాలుగేళ్లు ప్రధానిగా పనిచేసిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నాయకుడు జుల్ఫికర ఆలి భుట్టో అర్థంతరంగానే వైదొలిగారు. ఏదో దశకం చివర్లో నాటి సైనిక పాలకుడు జనరల్ జియా ఉల్ హక్ దేశ ద్రోహం నేరం కింద భుట్టోను ఉరితీయించాడు. భుట్టో కూతురు బెనజీర్ భుట్టో రెండుసార్లు ప్రధాని అయినప్పటికీ పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు. మొదటి సారి 21 నెలలు, రెండోసారి 37 నెలలు ఆమె పదవిలో ఉన్నారు. చివరికి ఆమె హత్యకు గురయ్యారు. పనామా కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ ముస్లిం లీగ్ నాయకుడు నవాజ్ షరీఫ్ మూడుసార్లూ అర్థాంతరంగానే పదవి నుంచి వైదొలిగారు. 1993, 1999, 2017లో నవాజ్ షరీఫ్ ప్రధాని పదవి నుంచి దిగిపోక తప్పలేదు. 1993లో అవినీతి ఆరోపణలపై 1999లో సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ సైనిక కుట్ర కారణంగా పదవీచ్యుతులయ్యారు. 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా షరీఫ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.మూడు సార్లు సైన్యాధిపతులు పౌర ప్రభుత్వాన్ని థిక్కరించి అధికార పగ్గాలు అందుకున్నారు. దేశ రక్షణకు బాధ్యత వహించాల్సిన సైన్యం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఒక్క పాకిస్థాన్ లోనే తప్ప ఎక్కడా లేదు. స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్లకే సైనిక పాలనకు బీజం పడింది. నాటి పాక్ అధినేత ఇస్కందర్ అలీ మిర్జాను పదవి నుంచి తొలగించి సైన్యాధిపతి జనరల్ ఆయూబ్ ఖాన్ గద్దెనెక్కారు. పదకొండేళ్ల పాటు ఆయన పాక్ రాజకీయాలను శాసించారు. అనంతరం 1977లో అప్పటి ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో నుంచి సైన్యాధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్ అధికార పగ్గాలను అందుకున్నారు. 1999లో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ కూ ఇదే పద్ధతి ఎదురైంది. అప్పటి సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ సైనిక కుట్ర ద్వారా షరీఫ్ ను గద్దె దించి అధ్యక్షుడయ్యారు.1949లో లియాఖత్ ఆలి ఖాన్, 1980లో జనరల్ జియా ఉల్ హక్, 1995లో బెనజీర్ భుట్టోపై మిలటరీ కుట్రలు జరిగినప్పటికీ విజయవంతం కాలేదు. సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ 9 సంవత్సరాల పాలనలో నలుగురు ప్రధానులు మారారు. సైనిక పాలకుల హయాంలో ప్రధానులు నిమిత్త మాత్రులే. మొత్తానికి సైనిక కుట్రలు, అవినీతి కుంభకోణాల కారణంగా పాకిస్థాన్ ప్రధానులు పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తం కావడం సహజం. సైన్యం ఎంతవరకూ ఆయన్ను నెత్తిన పెట్టుకుంటుందో చెప్పడం కష్టమే. సైన్యానికి ఇష్టం లేని మరుక్షణం ఎంతటి ప్రజాదరణ గల నాయకుడైనా పదవిని వదులుకోక తప్పదు. ఇది ఎవరోచెప్పిన మాట కాదు. పాక చరిత్ర చెబుతున్న చేదునిజం. చారిత్రక సత్యం. ఈ వాస్తవాన్ని ఇమ్రాన్ ఖాన్ తో సహా ఎవరూ కాదనలేరు. ఎందుకంటే అది అక్షర సత్యం కాబట్టి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ భవితవ్యంపై కాలమే సమాధానం చెప్పాలి.