YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మళ్లీ తెరపైకి ఇరువర్ మూవీ..!!

మళ్లీ తెరపైకి ఇరువర్ మూవీ..!!
ఇరువర్.. తమిళనాట ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినిమా. విలక్షణ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో ‘ఇద్దరు’గా విడుదలై ఇక్కడ కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది. కళంగర్ (కళాకారుడు) కరుణానిధి, తమిళ మహానటుడు ఎంజీఆర్ జీవిత కథల నేపథ్యంలో మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఎంజీఆర్ తరహా పాత్రలో మోహన్‌లాల్ మెస్మరైజ్ చేయగా.. కరుణ పాత్రలో ప్రకాశ్‌ రాజ్ నవరసాలు ఒలికించారు. ఐశ్వర్యారాయ్, గౌతమి కీలక పాత్రల్లో అదరగొట్టారు. డీఎంకే అధినేత, తమిళ సూరీడు కరుణానిధి అస్తమించడంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, తమిళతెర మహానటుడు, ఆ రాష్ట్ర మరో మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ మొదట్లో ప్రాణస్నేహితులు. రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా వారిద్దరూ తదనంతర కాలంలో బద్ధ శత్రువులయ్యారు. ద్రవిడ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అన్నాదురై కరుణానిధికి గురువు. అన్నాదురై మృతి తర్వాత ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ (డీఎంకే) పార్టీ బాధ్యతలు అందుకున్న కరుణ.. సీఎం అయ్యారు. అదే పార్టీలో ఎంజీఆర్ కీలక నేతగా ఎదిగారు. ఒక దశలో కరుణానిధిని ఎంజీఆర్ గురువుగా భావించేవారు. కరుణ సీఎం అయిన తర్వాత కూడా ఎంజీఆర్‌తో ఆయనకు సత్సంబంధాలే ఉండేవి. కానీ, ఆ తర్వాత పార్టీలో ఆధిపత్య పోరు మొదలై చీలికకు దారితీసింది. కరుణానిధి తన కుమారుణ్ని ముందుకు తెస్తున్నారనే ఆరోపణలతో ఎంజీఆర్‌తో పాటు డీఎంకేలోని ఒకవర్గం కొంత వ్యతిరేకత పెంచుకుంది. క్రమంగా అదే బద్దవైరంగా మారింది. దీంతో ఎంజీఆర్ డీఎంకే నుంచి వైదొలిగి.. ‘ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)’ పేరుతో సొంత పార్టీ స్థాపించారు. కరుణానిధిని రాజకీయంగా చావుదెబ్బ తీసి ముఖ్యమంత్రి అయ్యారు. మరో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎంజీఆర్ వెంటే నడిచారు.అన్నాదురై మరణం తర్వాత తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధి.. ఆ తర్వాత ఎంజీఆర్ మరణించేంత వరకు సీఎం కాలేకపోయారంటే, ఎంజీఆర్ ఎంతగా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ అరుదైన స్నేహం-రాజకీయ వైరం కథాంశంతో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల జీవిత కథతో మణిరత్నం ‘ఇరువర్’ తెరకెక్కించారు. కరుణ-ఎంజీఆర్ జీవిత కథలు అనేసరికి కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. దానికి తగ్గట్టే సినిమాలో కొన్ని వివాదాస్పదమైన అంశాలకు చోటిచ్చారు. దీంతో సినిమాపై తమిళనాట పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. గొడవ ఎక్కువయ్యే సరికి మణిరత్నం ఇది కల్పిత కథేనంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ‘ఇద్దరు’ సినిమాలో పలు సన్నివేశాలను మణిరత్నం అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. ఎంజీఆర్ చనిపోయినప్పుడు కరుణానిధి శ్రద్ధాంజలి ఘటించేందుకు రాగా.. డీజీపీ ఆయణ్ని అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని కోరతారు. శాంతిభద్రతల సమస్య పేరుతో ఆయణ్ని సున్నితంగా పంపించేస్తారు. అప్పుడు కరుణానిధి పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎంజీఆర్‌ను తలచుకుంటూ చెప్పే కవిత్వం కంటతడి పెట్టిస్తుంది. 
ఓడలు మన్నంట, ఉసురు నిప్పంట.. ఇది జగతికి చెబుతాం ఎలుగెత్తి.. 
జనం పిలవంగ, మనం గెలువంగ, ఉదయం ఇక మాలో వెలుగంగ.. నా విజయపథంలో ఎవరడ్డైనా, విందులు చేస్తాం మిన్నెక్కి..’ అంటూ సాగే ఆ కవిత్వంలో చివరికి.. ‘మిత్రమా నువ్వెక్కడ? నీ నవ్వెక్కడ? నను మోసిన నీ ఎగుభుజాలెక్కడ?’ అంటూ కవితాత్మక ధోరణిలో తన బాధను ఒంటరిగోడుగా వెళ్లబోసుకుంటాడు కరుణ పాత్రధారి ప్రకాశ్ రాజ్. స్వతహాగా కవి అయిన కరుణానిధి జీవితానికి ఇది చాలా దగ్గరగా ఉండటంతో బాగా పాపులర్ అయింది. తమిళ మాతృకకు ఏమాత్రం తీసిపోనివిధంగా తెలుగులో సుప్రసిద్ధ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి అద్భుతమైన సాహిత్యాన్ని అందించడం విశేషం. 

Related Posts