మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గ్రామదర్శిని నోడల్ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. దాదాపు వెయ్యిమంది గ్రామదర్శిని నోడల్ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిణామ క్రమం వివరించారు. మద్రాసు రాష్ట్రం నుంచి ప్రారంభమై ఇప్పటి కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వరకు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. అన్ని రాష్ట్రాలకు అవతరణ దినోత్సవాలు ఉన్నాయి. ఒక్క మన రాష్ట్రానికే అవతరణ దినోత్సవం లేదు. అందుకు కారణం ఆరుదశాబ్దాల ఆటుపోట్లే. కట్టుబట్టలతో నడిరోడ్డపైకి నెట్టారు.అయినా పట్టుదలతో కసిగా పోరాడుతున్నామని అన్నారు. పునాదుల నుంచి రాష్ట్రాన్ని నిర్మించుకుంటున్నాం. నవ నిర్మాణదీక్ష చేపట్టాం,మహా సంకల్పం తీసుకున్నాం. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నాఉద్యోగులకు 42% ఫిట్ మెంట్ ఇచ్చాం. రాష్ట్ర నిర్మాణంలో అధికారయంత్రాంగానిదే కీలక భూమికఅని అయన అన్నారు. ఒక జాతీయ పార్టీ అడ్డగోలు విభజన చేసి అన్యాయం చేసింది.మరో జాతీయ పార్టీ నమ్మకద్రోహానికి పాల్పడింది. మన ఎంపిలు రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాం. రాష్ట్రం కోసం ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం ఒక చరిత్రఅని అన్నారు. దేశం మొత్తం మన హక్కుల కోసం మద్ధతుగా నిలిచాయి. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాయి. విభజన చట్టంలో అన్ని అంశాలు అమలు చేయాలని ఒత్తిడి చేశాయి. వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకోవడం దారుణం. కడప స్టీల్ కోసం,విశాఖ రైల్వే జోన్ కోసం మన ఎంపిలు పోరాడుతున్నారు. కష్టాలను అధిగమించి 1500రోజుల పాలన పూర్తి చేసుకున్నాం. దేశంలోనే వృద్ధిరేటులో ముందున్నాం.జాతీయస్థాయి వృద్ది కన్నా ఎంతో ముందున్నాంమని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లుగా 10.5% సగటు వృద్ది సాధించాం.దేశంలో గత నాలుగేళ్లలో నెంబర్ వన్ గా ఉన్నాం. కానీ పొరుగు రాష్ట్రాలలో తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నాం.పొరుగు రాష్ట్రాల కన్నా రూ.35వేలు తలసరి ఆదాయం వెనుకబడి ఉన్నాం. నాలుగేళ్ల మన కృషి ఫలితమే అనేక అవార్డులు.దాదాపు 511 అవార్డులు సాధించడం ఒక రికార్డు అని అన్నారు. ఈ రోజు మనం సాధించిన విజయం నా ఒక్కడి విజయం మాత్రమే కాదు.ఇది బృంద విజయం.నేను కేవలం బృంద నాయకుడిని మాత్రమేనని అన్నారు.