రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. ఏకగ్రీవానికి ప్రయత్నిస్తోన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. విపక్షాల తరఫున కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్‌ను బరిలోకి నిలపాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాజ్యసభ ఉపాధ్యాక్ష పదవికి గురువారం ఎన్నిక నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ, సీపీఐ, టీఎంసీ, బీఎస్పీ తదితర పార్టీల మద్దతుతో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా హరిప్రసాద్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. సీపీఐ నేత రాజా స్వయంగా హరిప్రసాద్ పేరును ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఆప్, తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం తదితర పార్టీల మద్దతు ఖాయంగా కనిపిస్తోంది. అంతకు ముందు విపక్షాల అభ్యర్థిగా ఎన్సీపీ ఎంపీ వందనా చవాన్‌ను పేరు దాదాపు ఖరారు చేశారు. మంగళవారం రెండోసారి ప్రతిపక్ష పార్టీలు సమావేశమైనప్పుడు ఎన్సీపీ సభ్యురాలు వందనా చవాన్ పేరును బీజేపీ నేత సతీశ్ చంద్ర మిశ్రా, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డేరక్ ఓబ్రెయిన్ ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఎన్డీఏలోని కొన్ని పార్టీలు కూడా ఆమెకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి. అయితే అనూహ్యంగా కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న హరి ప్రసాద్ పేరును ప్రతిపాదించడం విశేషం. ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు. దీనిపై హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తీసుకునే ముందు పార్టీ చాలా ఆలోచించిందని, మిగతా ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చిస్తామని అన్నారు. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కోరారు. అయితే, ఆజాద్ కోరికను సున్నితంగా తిరస్కరించిన నవీన్ పట్నాయక్, తాము జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌కు మద్దతిస్తామని హామీ ఇచ్చామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.