ఏపీ సీఎం చంద్రబాబు రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయాలు పార్టీకి రివర్స్ గేర్ వేశాయి. పార్టీలో అసంతృప్తులను తగ్గించి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కుదామని భావించిన చంద్రబాబుకు తాజాగా తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ మాదిరిగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల రేసులో ఉన్న కొందరు కీలక నాయకులకు చంద్రబాబు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. అయితే, ఇప్పటికే దశాబ్దాలుగా పార్టీలో ఉన్నవారిని కాదని, కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వారిలో కొందరికీఈ పదవులు దక్కడం విస్మయం, విచారం కలిగించింది. దీంతో సీనియర్లు తమ దారి తీము చూసుకునేందుకు రెడీ అయ్యారు.ఇక, ఈ నామినేటెడ్ కుంపటి.. తూర్పు గోదావరిలోనూ మంటలు రేపుతోంది. జిల్లాకు రెండు కార్పొరేషన్ల చైర్మన్ పదవులు దక్కాయి. అందులో జిల్లా టీడీపీ అధ్యక్షుడు నామన రాంబాబుకి చిన్నతరహా నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి కట్టబెట్టారు. రామ్మోహనరావు అనే ఇంకో వ్యక్తికి కనీస వేతనబోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు. రామ్మోహన్ రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. స్వగ్రామం అన్నవరంలో సైతం ఆయన చాలామందికి తెలియదు. జిల్లా టీడీపీ కేడర్‌లో రామ్మోహన్ పేరు ప్రకటించిన తర్వాత అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. జిల్లా పార్టీతోకానీ, జిల్లాతో కానీ ఏమాత్రం సంబంధంలేని వ్యక్తికి ఏ లాబీయింగ్ ద్వారా పదవి ఇచ్చారంటూ అప్పట్లో కార్యకర్తలంతా ఆవేదనతో ప్రశ్నించారు.ప్రస్తుతం బీసీ సహకార ఆర్థిక కార్పొరేషన్, ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థలతోపాటు.. మరో రెండింటికి నామినేటెడ్ చైర్మన్లను నియమించారు. ఈ దఫా తూర్పుగోదావరి జిల్లాకూ కీలక కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇస్తారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆశగా ఎదురుచూశారు. పార్టీలో తమ సేవలను గుర్తించి మంత్రులు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప తమకు రికమండ్ చేస్తారంటూ చాలామంది ఆశపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచీ పార్టీ మారకుండా, సిన్సియర్‌గా పనిచేసినవాళ్లు, ఆస్తులు పార్టీకోసం అమ్ముకుని ఆర్థికంగా నష్టపోయినవాళ్లూ.. సమర్థులైన వాళ్లు ఎందరో ఈ జిల్లాలో ఉన్నారు. అర్హత ఉన్నా ఏవేవో కారణాలు చూపుతూ తమకు పదవులు ఇవ్వడంలేదంటూ ఆయా వర్గాలలో నిరుత్సాహం అలముకుంది.2014 ఎన్నికల సమయంలో జనానికి ఇచ్చిన హామీలతోపాటు టీడీపీ కార్యకర్తలకూ అనేక హామీలు ఇచ్చారని, దశాబ్దా లుగా జెండా మోస్తూ నాయకులు అలసిపోయారు. ఆర్థికంగా చితికిపోయారు. అలాంటివారిని కాంగ్రెస్‌లా అడ్డదారుల్లో కాకుండా అఫీషియల్‌గా ఆదుకుందాం..’ అంటూ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన మాట జిల్లాలో అమలుకావడంలేదని అసలు సిసలు టీడీపీ కార్యకర్తలు నిరాశచెందుతున్నారు.