YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జీవీఎల్ పై పార్టీలో అంతర్గత చర్చ

జీవీఎల్ పై పార్టీలో  అంతర్గత చర్చ

అసలు ఈ జీవీఎల్ ఎవరు? రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు ఆయనకు ఏం సంబంధం? ఈ ప్రశ్నలు ఒక తెలుగుదేశం పార్టీ నుంచే కాదు. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో జీవీఎల్ నరసింహరావు జోక్యాన్ని బీజేపీ నేతలు కూడా సహించలేకపోతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన జీవీఎల్ నరసింహారావు భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కాని కొన్నేళ్ల నుంచి ఆయన మకాం ఢిల్లీలోనే రాష్ట్రంతో ఆయనకు పెద్దగా సంబంధాలు లేవు. గత నాలుగేళ్ల నుంచి ఆయన రాష్ట్రానికి వచ్చిందీ లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనిందీ లేదు. బీజేపీలోనూ అతి కొద్దిమందికే జీవీఎల్ తెలుసు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండటంతో ఢిల్లీకి తరచూ వెళ్లే ఏపీబీజేపీ నేతలకు మాత్రమే ఆయన కాస్తో కూస్తో పరిచయం.నిన్నమొన్నటి వరకూ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నరసింహారావును గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారంటున్నారు. బీజేపీ, టీడీపీ సంబంధాలు తెగిపోవడంతో కేంద్ర నాయకత్వం కూడా ఏపీ అంశాలను జీవీఎల్ తోనే మీడియాకు చెప్పించే పనిలో పడింది. రాజ్యసభలో జరిగిన చర్చలో కూడా జీవీఎల్ ఎక్కువ సేపు ఆంధ్రప్రదేశ్ విషయాలపై అనర్గళంగా మాట్లాడారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న తర్వాతే ఏపీ రాజకీయాల్లో జీవీఎల్ వేలుపెడుతున్నారన్నది పార్టీ నేతల అభిప్రాయం.తాజాగా జరిగిన సంఘటనతో జీవీఎల్ పై ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా విశాఖ పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు వంటి నేతలు జీవీఎల్ జోక్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిన్న కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో తెలుగుదేశం పార్టీ నేతలు విశాఖ రైల్వే జోన్ విషయం మాట్లాడే సమయంలోనూ జీవీఎల్ జోక్యం సరికాదన్నది కంభంపాటి అభిప్రాయం. రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ జీవీఎల్ కు ప్రాధాన్యత ఇచ్చినందునే ఆయన అనవసరంగా జోక్యం చేసుకుని దీన్ని వివాదంగా మార్చారని,దీనివల్ల పార్టీకి ఇబ్బంది అని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.ఆయనకు సంబంధంలేని విషయాల్లో కూడా జీవీఎల్ జోక్యం చేసుకుంటున్నారని, కేంద్ర నాయకత్వం ప్రోత్సహించడం వల్లనే జీవీఎల్ తరచూ ఇలా వివాదాలు తెస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. జీవీఎల్ ఏపీకి సంబంధించిన వ్యక్తే కాని, ఆయనకు రాష్ట్ర పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవంటున్నారు. తాము చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతున్నా, జీవీఎల్ వచ్చి దాన్ని వివాదంగా మార్చి రాద్ధాంతం చేస్తున్నారంటున్నారు. కేంద్ర నాయకత్వం ఇప్పటికైనా ఏపీ అంశాల్లో రాష్ట్రంలో ఉన్న పార్టీ బాధ్యులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. జీవీఎల్ జోక్యంపై ఇటు తెలుగుదేశం పార్టీ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉంది.

Related Posts