తొలి టెస్టులో విజయానికి చేరువగా వచ్చినా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో పరాజయంపాలైన భారత జట్టు గురువారం ఆరంభమయ్యే రెండో టెస్టులో ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. బ్యాటింగ్ బలహీనతలను భారత్ ఎలా అధిగమిస్తుంది, ఇంగ్లాండ్ పేసర్లను ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం. మరోవైపు ఇంగ్లండ్ టీమ్ లైనప్‌పై స్పష్టత వచ్చింది. డేవిడ్ మలన్‌ను తప్పించగా.. తొలి టెస్టులో అదరగొట్టిన ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ కోర్టు కేసు కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమవడం వారికి పెద్ద దెబ్బే. పిచ్ పరిస్థితిని బట్టి కెప్టెన్ ఇద్దరు స్పిన్నర్లకు జట్టులో చోటు కల్పిస్తారా? అనేది వేచి చూడాలి. 20 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్ ఒలివర్ పోప్‌కు తుది జట్టులో చోటు ఖాయమని రూట్ ప్రకటించాడు. కాగా, నెట్ ప్రాక్టీ్‌సలో రూట్‌కు గాయం కావడం ఇంగ్లండ్‌కు చేదువార్తే. అయితే, అది పెద్ద గాయం కాదని.. రూట్ బరిలోకి దిగగలడని ఇంగ్లండ్ భావిస్తోంది.
ఇక పిచ్ విషయానికి వస్తే వేడి గాలుల కారణంగా లార్డ్స్ పిచ్‌పై పచ్చికను కాపాడడం మైదాన సిబ్బందికి సవాలుగా మారింది. పరిస్థితులు దాదాపుగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఉన్నట్లే ఉన్నాయి. బంతి అక్కడిలాగే స్వింగవుతుందా ? లేదా స్పిన్నర్లకేమైనా సహకారం లభిస్తుందా అన్నదానికి కచ్చితమైన సమాధానం లేదు.