బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: నితిన్, రాశీ ఖన్నా,నందితా శ్వేత, పూనమ్‌కౌర్, జయసుధ, ఆమని, సితార, సీనియర్ నరేశ్, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు
సంగీతం: మిక్కీ జె మేయర్
కెమెరా: సమీర్ రెడ్డి
దర్శకత్వం: సతీష్ వేగేశ్న
సమర్పణ: శ్రీమతి అనిత
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
కథ:
శ‌్రీనివాస్(నితిన్) సగినేటి పల్లెకు చెందిన యువకుడు. ఆర్కిటెక్చర్‌గా పనిచేస్తుంటాడు. చంఢీఘర్‌లో ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న శ్రీనివాస్.. అక్కడే కాఫీ డేలో పనిచేస్తున్న సిరి(రాశీ ఖన్నా)ని కలుస్తాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే పెళ్లి మాత్రం పెద్దల అంగీకారంతోనే చేసుకోవాలనుకుంటారు ఇద్దరూ. దాంతో శ్రీనివాస్ సిరి తండ్రి.. హైదరాబాద్‌లో పెద్ద బిజినెస్‌మేన్ ఆర్.కె(ప్రకాశ్ రాజ్)ని కలుసుకుని తమ ప్రేమ విషయం చెబుతాడు. అలాగే సంప్రదాయానికి విలువ నిచ్చి తన ఊర్లోని పెళ్లి జరగాలని.. తన నాయనమ్మ కోరికను నేరవేర్చాలని కూడా శ్రీనివాస్ చెబుతాడు. ప్రతి సెకన్‌ని వేస్ట్ చేయకుండా బిజినెస్ గురించే ఆలోచించే ఆర్.కె కూతురు కోసం పెళ్లికి ఒప్పుకుంటాడు. అయితే ఒకవేళ తన కూతురు ఎప్పుడైనా విడిపోవాలనుకుంటే విడాకులు వెంటనే ఇచ్చేయాలని ముందుగానే అగ్రిమెంట్ చేయించుకుంటాడు ఆర్.కె. అయితే ఓ కండీషన్‌పై శ్రీనివాస్ ఆగ్రిమెంట్‌పై సంతకం పెడతాడు. ఇంతకు శ్రీనివాస్.. ఆర్.కె కి ఎలాంటి కండీషన్ పెడతాడు? శ‌్రీనివాస్, సిరి ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి చేసుకుంటారా? ఇంతకు ఆర్.కె.. శ్రీనివాస్‌తో చేసుకున్న అగ్రిమెంట్ గురించి అందరికీ తెలుస్తుందా? శ‌్రీనివాస్ కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- నేపథ్య సంగీతం
- కెమెరా వర్క్
- పెళ్లి సన్నివేశంలో వచ్చే సంభాషణలు
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- పాటలు ఆకట్టుకోవు
- పాత్రలు, వాటిని డిజైన్ చేసిన తీరు, వాటి మధ్య ఎమోషన్స్ బలంగా అనిపించవు
- కాలంతో పోటీ పడుతున్న యువతకు సినిమా ఎంత వరకు కనెక్ట్ కాదు
- బలహీనమైన కథ
విశ్లేషణ:
సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఇదే కాన్సెప్ట్‌తో మన సంప్రదాయంలో ముఖ్యమై ఘట్టమైన పెళ్లి అనే అంశం చుట్టూ దర్శకుడు సతీశ్ వేగేశ్న అల్లుకున్న కథే `శ్రీనివాస కళ్యాణం`. శతమానం భవతి అనే చిత్రంతో విజయాన్ని అందుకున్న దర్శకుడు సతీశ్ వేగేశ్న.. రాసుకున్న కథ ఇది. ఇందులో ఇద్దరు మనుషులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేసే పెళ్లి గురించి ఏదో చెప్పాయాలని చెప్పేయకుండా.. ఎలా జరిపిస్తారు. పెళ్లి కూతురు తండ్రి ఏం చేయాలి.. పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? ఇలా అన్ని విషయాలను చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం యూత్ మనోభావాలకు.. ఈ సినిమా కనెక్ట్ అవుతుందా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. సినిమా కనెక్ట్ కావడం కష్టమే అనిపిస్తుంది. ఇక పాత్రలు, వాటిని మలిచిన తీరు, వాటి మధ్య భావోద్వేగాలు ఎఫెక్టివ్‌గా అనిపించవు. నితిన్, రాశీఖన్నా పాత్రలు జస్ట్ ఓకే. లుక్ పరంగా ఇద్దరి జంట తెరపై చూడటానికి చక్కగా ఉంది. ఇక మిలయనీర్‌గా నటించిన ప్రకాశ్‌రాజ్ .. పాత్రను సునాయసంగా చేసేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నితిన్, ప్రకాశ్ రాజ్ మద్య నడిచే ఎమోషనల్ సీన్‌లో నితిన్ డైలాగ్స్ వివరణ మరీ ఎక్కువైనట్లు అనిపించేస్తుంది. నందితా శ్వేతా, జయసుధ, రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్, ప్రభాస్ శ్రీను, సితార, ఆమని ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. పాత్రధారులు కంటే పాత్రలను సరిగా డిజైన్ చేయకపోవడం అనేది సినిమాలో ఫీల్‌ను క్యారీ చేయదు. హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు, సత్యం రాజేశ్, హరితేజ, ప్రవీణ్, విద్యుల్లేఖ ఇలా అన్ని పాత్రల మధ్య సన్నివేశాలు ఏదో రన్ అవుతున్నాయంటే.. రన్ అవుతున్నాయనేలా ఉంటాయి. ఇక సాంకేతికంగా చూస్తే.. పాటలు సరిగ్గా ఆనవు కానీ.. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చింది. పాత్రల మధ్య వచ్చే కీలక సిచ్యువేషన్స్‌లోని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.