దుర్గగుడి పాలకవర్గం ఎన్నో వివాదాలు.. కుంభకోణాలు.. ఆలయ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే కార్యక్రమాలు జరిగాయి. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో పాలక వర్గం మితిమీరి జోక్యం చేసుకుంటుందన్న ఫిర్యాదులు ఉన్నాయి. విధాన నిర్ణయాలు రూపొందించడంతోపాటు ఆలయ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. దాతల నుంచి విరాళాలు అధికంగా వచ్చేలా చూడాల్సి ఉంటుంది. సామాన్య భక్తులకు ఎదురవుతున్న సమస్యలను తీర్చేందుకు సౌకర్యాలు మెరుగుపర్చాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పాలక వర్గం అన్నీ తామే అన్నట్లు అధికారాలు చెలాయిస్తూ సిబ్బందిపై పెత్తనం చేస్తోందన్న విమర్శలు మూటగట్టుకుందిఅవినీతి అధికారులతో పాలకవర్గం సభ్యులు కొందరు కలిసిపోయి ఆదాయానికి గండి కొడుతున్నారు. చీర మాయం విషయంలో పాలక వర్గం సభ్యురాలు సూర్యలతపై అభియోగాలు రావడంతో అసలు పాలవర్గం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛైర్మన్ గౌరంగబాబు పనితీరుపై సీఎం చంద్రబాబునాయుడు సైతం అసంతృప్తితో ఉన్నారు. పాలకవర్గంలో 16 మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో ప్రధాన అర్చకులు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్నారు. ఒక బీజేపీ సభ్యుడిని తీసుకున్నారు. మిగిలిన 14 మంది అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన వ్యక్తులే. ఈఓగా సూర్యకుమారి ఉన్న సమయంలో పాలకవర్గంతో ఆమెకు ఏ మాత్రం పొసగలేదు. పాలకవర్గానికి కనీసం ప్రొటోకాల్ కూడా లభించేదికాదు. కొండమీదకు రావద్దని ఖరాఖండిగా చెప్పారు. దీంతో పాలక వర్గం కేవలం సమావేశాలకే పరిమితమైంది. అర్థరాత్రి పూజల వ్యవహారంపై వేసిన కమిటీ నివేదికలు ఇంతవరకు వెలుగు చూడలేదు. కానీ ఐఏఎస్ అధికారికి మళ్లీ మంచి పోస్టింగ్ లభించింది.తర్వాత వచ్చిన ఈవో పద్మ పాలకవర్గానికి విలువ ఇచ్చారు. ప్రొటోకాల్ పాటించారు. దీంతో కొంతమంది సభ్యులు రెచ్చిపోయారు. అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పాలక వర్గం సభ్యులను కమిటీలుగా వేశారు. చీరల విభాగం, అన్నదానం విభాగం, వేలంపాటల పర్యవేక్షణ, కొనుగోలు కమిటీ ఇలా వేశారు. ఇక్కడ అధికారులు నామమాత్రంగా మారి సభ్యులే కార్యనిర్వాహకులుగా అధికారం చెలాయిస్తున్నారు. కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చీరల మాయం కొత్త విషయం కాదని విజిలెన్సు విచారణలో తేలింది. గత ఈవో హయాంలోనే దాదాపు రూ.కోటి వరకు చీరలు మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. చీరలను పర్యవేక్షించే బాధ్యతలను సూర్యలతకు అప్పగించారు. ఆమె చీరను తీసుకెళ్లడం సీసీ టీవీ పుటేజీలో కనిపించింది. అయితే ఈచీరను భక్తులు తనకే సమర్పించారని ఆమె సెలవు ఇవ్వడం విశేషం. దుర్గగుడి నుంచి తస్కరించిన చీరలతోనే ఓ వ్యక్తి వ్యాపారం చేస్తున్నట్లు పాలకవర్గ సభ్యులే చెబుతున్నారు.ఇటీవల దుర్గగుడిలో కొత్తగా సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏంజెల్స్ అనే కొత్త సంస్థ టెండర్ దక్కించుకుంది. కానీ మరో సంస్థ రాపిడ్ యాక్షన్ ఫోర్సుకు ఇవ్వాలని స్వయంగా ఛైర్మన్ ఒత్తిడి చేయడం గమనార్హం. ఈ ప్రొక్యూర్ మెంట్ ద్వారా పిలిచిన టెండర్లలో ఏంజెల్స్ దక్కించుకుంది. కానీ సగం సగం ఇవ్వాలని ఛైర్మన్ తోపాటు కొంతమంది సభ్యులు ఒత్తిడి చేయడంతో రెండు నెలలు పెండింగ్‌లో పడింది. ఎట్టకేలకు నిబంధనల ప్రకారం ఈవో పద్మ వ్యవహరించి ఏంజెల్స్‌కు అప్పగించారు.గతంలో సెక్యూరిటీలో ఉన్న యువతిని ఓ సభ్యుడు లొంగదీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగం శాశ్వతం చేయిస్తానని మాయమాటలు చెప్పినట్లు ప్రచారం జరిగింది. మరో యువతిపై కూడా వల వేయడంతో ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో ఛైర్మన్ జోక్యం చేసుకుని ఆ సభ్యుడికి మచ్చ రాకుండా, సంఘటన వెలుగు చూడకుండా సర్దుబాటు చేశారు.ప్రస్తుతం సీసీ టీవీలు నియంత్రించే ఉద్యోగి ఓ సభ్యురాలి బంధువు కావడం విశేషం. అదేవిధంగా రూ.కొటి విలువైన సీసీ టీవీల ఏర్పాటు టెండర్‌ను ఆ సభ్యురాలు చక్రం తిప్పి తమవారికి దక్కేటట్లు చేసినట్లు తెలిసింది. బియ్యం, పచారీ సామగ్రి కొనుగోలులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనిలోనూ ఇతర కాంట్రాక్టర్లు రాకుండా చక్రం తిప్పుతున్నారు. దీనిలోనూ కమీషన్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ సామగ్రి కొనుగోలు టెండర్ లేకుండానే అప్పగించడం విశేషం.కర్ణాటకకు చెందిన ఓ ఏజెన్సీ ద్వారా నెయ్యి కొనుగోలు చేయాలని పాలకవర్గం తీవ్ర ప్రయత్నాలు చేసింది. సభ్యుల్లో రెండు వర్గాలుగా ఏర్పడి రచ్చ రచ్చ చేశారు. ఎట్టకేలకు ఆ ఏజెన్సీకి వద్దని తేల్చారు. స్వయంగా ఛైర్మన్ ఆ ఏజెన్సీకి ఇవ్వాలని పట్టుబట్టారు.