విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. అధికారవర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం... ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ల నుంచి గంజాయి అక్రమ రవాణాకు విజయవాడను గేట్‌వేగా వాడుకుంటున్నారు. గంజాయి మత్తు రాజధానిలో యువతను చిత్తు చేస్తోంది. చదువు, కెరీర్‌ను నిర్లక్ష్యం చేస్తూ భవిష్యత్‌ను పాడుచేసుకుంటున్నారు. విజయవాడ, గుంటూరులలో రెండేళ్లుగా మానసిక వైద్యుల వద్దకు వస్తున్న రోగుల్లో యువతే ఎక్కువుగా ఉంటున్నారు. వారిలో కూడా 50 శాతం మంది గంజాయికి బానిసలుగా మారినవారే ఉండటం గమనార్హం. గతంలో ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులు కొందరు గంజాయికి అలవాటు పడేవారు. కానీ ప్రస్తుతం డిగ్రీ, ఇంటర్మీయడిట్ విద్యార్థులు కూడా గంజాయికి బానిసలుగా మారుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందిరోడ్డు, రైలు మార్గాల ద్వారా భారీ పరిమాణంలో హనుమాన్ జంక్షన్– విజయవాడ మధ్యలో గిడ్డంగులకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి చిన్న చిన్న బస్తాల్లో ప్యాక్ చేసి 90 శాతం సరుకును తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు సరఫరా చేస్తున్నారు. 10 శాతం వరకు గంజాయిని రాజధానిలోనే విక్రయిస్తున్నారు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని విజయవాడ, గుంటూరు శివారు ప్రాంతాలు, వృత్తి విద్యా కాలేజీలు, వన్‌టౌన్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా విక్రయాలు సాగిస్తున్నారు. గంజాయిని చిన్నచిన్న పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నారు. గంజాయి పొడిని కూర్చిన సిగరెట్ల పట్ల యువత ఎక్కువుగా ఆకర్షితులు అవుతున్నారు..రాజధానిలో ఒక్కో చిన్న గంజాయి ప్యాకెట్ రూ.500 నుంచి రూ.2వేల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. గంజాయి పొడి కూర్చిన సిగరెట్ ఒక్కోటి డిమాండ్‌ను బట్టి రూ.100 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. అధికారవర్గాల అంచనా ప్రకారం అమరావతి పరిధిలో నెలకు రూ.3 కోట్ల వరకు గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి 2017లో నివేదిక ప్రకారం మత్తు పదార్థాలకు బానిసవుతున్న యువతలో మన రాష్ట్రం రెండోస్థానంలో ఉంది. రాష్ట్రంలో 60 శాతం యువత మత్తు పదార్థాల వ్యసనపరులుగా మారుతున్నారు. అందులో మద్యంతోపాటు గంజాయి, ఇతర డ్రగ్స్ ఉన్నాయి. అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 50 శాతం ప్రొఫెషనల్ కాలేజీల్లో గంజాయి అందుబాటులోకి వచ్చిందని ఓ అధికారి తెలిపారు.రోజూ కనీసం 10 మంది నుంచి 15 మంది పిల్లలను వారి తల్లిదండ్రులు తమ వద్దకు చికిత్స కోసం తీసుకువస్తున్నారని ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తెలిపారు. వారిలో 17 ఏళ్ల వయసు విద్యార్థులు కూడా ఉండటం మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. యువత భవితను ఛిద్రం చేస్తున్న గంజాయి రాకెట్‌పై అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏకీకృత వ్యవస్థ అంటూ లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విజయవాడలో యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయకపోవడం విస్మయపరుస్తోంది. పోలీసులు కూడా సాధారణ క్రైం అంశంగానే చూస్తున్నారు తప్పా ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదు. ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలు, బార్ల వ్యవహారాలకే పరిమితమవుతోంది. కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ ఇంటలిజెన్స్ విభాగాన్ని విజయవాడలో కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసింది. కానీ ఆ విభాగానికి సిబ్బంది కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంవిభాగాలు క్షేత్రస్థాయిలో ఆశించినస్థాయిలో సహకరించడం లేదు. దాంతో అప్పుడప్పుడు దాడులు చేయడం తప్పా ...నిరంతర నిఘా కొరవడుతోంది.