ఆదిలాబాద్ జిల్లాలో రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ..రిమ్స్.. ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తోంది. సౌకర్యాలు, సిబ్బంది విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఉమ్మడిజిల్లా ప్రజలకు సమర్ధవంతమైన వైద్యసేవలు అందిస్తోంది. ఇంతటి కీలకమైన వైద్యశాలకు భారతీయ వైద్య మండలి..ఎంసీఐ గుర్తింపు కొనసాగించటానికి నిరాకరించినట్లు వార్తలొస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 36 వైద్య కళాశాలలకు గుర్తింపును నిరాకరించగా తెలంగాణలో రిమ్స్‌తోపాటు నిజామాబాద్ వైద్య కళాశాల విషయంలోనూ ఈ తరహా నిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు పంపిందని సంబంధిత విభాగానికి చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పాలకులు, ఉన్నతాధికారులు, స్థానిక అధికారులు రిమ్స్‌పై చూపిన ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎంసీఐ గుర్తింపు కొనసాగించడానికి నిరాకరించడంతో ఇప్పటికప్పుడు విద్యార్థులకు నష్టం లేకున్నా ఉన్నత చదువులకు వెళ్లే వారికి సమస్యలు ఏర్పడవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై పలువురు విద్యార్ధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనా రిమ్స్‌లో అత్యున్నత వైద్య సేవలను కార్పొరేట్ స్థాయిలో అందిస్తున్నామని యాజమాన్యం చెప్తుంటే ఎంసీఐ గుర్తింపు కొనసాగించలేమని చెప్పడం కొంత షాకింగ్‌గా ఉంది. గుర్తింపుకు తగ్గ స్థాయిలో ఆసుపత్రిని తీర్చిదిద్దడంలో అధికారులు విఫలమై ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
వాస్తవానికి రిమ్స్ 2008లోనే వైద్య కళాశాలగా రూపాంతరం చెందింది. అంతకుముందు జిల్లా ఆసుపత్రిగా కొనసాగేది ఈ ఆసుపత్రి. ఇక 2008 నుంచి ఇప్పటివరకూ అయిదు బ్యాచ్‌ల వైద్య విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆరో బ్యాచ్ విద్యార్థులు జూనియర్ వైద్యులుగా సేవలందిస్తున్నారు. కళాశాల ప్రారంభం నుంచే ఇక్కడ ప్రొఫెసర్ల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. 153 వైద్యులు ఉండాల్సి ఉండగా, 45 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. కాలేజీలో ప్రధానంగా ఉన్న ప్రొఫెసర్ల సమస్య దృష్ట్యానే ఎంసీఐ గుర్తింపును కొనసాగించటానికి నిరాకరించిందనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. రిమ్స్‌లో బోధనకు ఆచార్యులు రాకపోవడానికి సరైన సౌకర్యాలు లేకపోవడమే కారణమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు తమ ప్రాభవం తగ్గుతుందన్న భావనతో స్థానికంగా ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్న కొందరు వైద్యులు కొత్త వైద్యులు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారనే అపవాదు కూడా ఉంది. వచ్చిన వారికి ఏదోటి చెప్పి ఇక్కణ్ణుంచి వెళ్లిపోయేలా కొందరు ఆచార్యులు వ్యవహరిస్తున్నారన్న టాక్ సైతం వినిపిస్తోంది. కొత్త వారు వస్తే తమ ప్రైవేటు వైద్య సేవలకు విఘాతం కలుగుతుందన్న భయంతో ఇలా చేస్తున్నారని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వైద్య కళాశాలలో ఉండాల్సిన వివిధ హోదాల్లో అధికారులు లేకపోవటం గుర్తింపు నిరాకరించటానికి మరో కారణమని అంటున్నారు. ఏదేమైనా ఎంసీఐ గుర్తింపు కొనసాగించడానికి నిరాకరించడం విద్యార్ధులను కలవరపరుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత మంత్రిత్వశాఖ స్పందించి రిమ్స్‌లో సమస్యలను పరిష్కరించడానికి కృషిచేయాలని అంతా కోరుతున్నారు. ఇదిలాఉంటే ఎంసీఐ నిర్ణయంపై తమకు సమాచారంలేదని రిమ్స్ సంచాలకులు అంటున్నారు. గుర్తింపు పునరుద్ధరణ ఉంటుందని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్తున్నారు.