ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టులన త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ రైల్వే అధికారులను కోరారు.రాష్ట్రంలో మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టులపై గురువారం అమరావతి సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ రైల్వే అధికారులు,రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమీక్షించారు.ఈసమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు నిధుల ఆవశ్యకత,భూసేకరణ,తిరుపతి రైల్వే స్టేషన్ పునరభివృద్ధి,రాయల చెరువు వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణం,నడికుడి-శ్రీకాళహస్తి సెక్షన్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో భూసేకరణ అంశాలు,రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు(ఆర్ఓబి),రైలు అండర్ బ్రిడ్జి(ఆర్ యుబి) లకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టులను అదే విధంగా రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయంలో సమస్యలుంటే వాటిని సకాలంలో పరిష్కరించుకునేందుకు సిసిఎల్ఏ తోను, సంబంధిత జిల్లా కలక్టర్లతోను నిరంతరం సమన్వయం కలిగి ఉండాలని చెప్పారు.అంతేగాక సంబంధిత శాఖాధికారుల సమన్వయంతో ఇలాంటి సమస్యలను సకాలంలో పరిష్కరించుకుని పనులు వేగవంతంగా జరిగేలా చూసేందుకు రైల్వే తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు.రాయల చెరువు వద్ద 18కోట్ల 88లక్షల వ్యవయంతో నిర్మించ తలపెట్టిన రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే వాటాగా 9కోట్ల రూ.లు భరిస్తుండగా మిగతా నిధుల్లో కొంత మొత్తాన్ని తుడా సమకూర్చగలిగితే మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు చేసేలా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రానికి హైస్పీడ్ రైలు ఇతర ప్రాజెక్టులను సకాలంలో మంజూరు చేయించేందుకు రైల్వై మంత్రిత్వ శాఖ,రైల్వే బోర్డుతోను నిరంతరం సంప్రదించి సాధించాల్సిన ఆవసరం ఉందని ఆదిశగా రైల్వే అధికారులు కూడా తగిన ప్రయత్నం చేయాలని సిఎస్ దినేష్ కుమార్ రైల్వే జియంకు సూచించారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల ప్రగతిని వివరిస్తూ రైల్వే సేప్టీకి సంబంధించి చేపట్టిన వివిధ పనుల్లో రైల్వే తరపును చేయాల్సిన చాలా వరకూ పూర్తి చేశామని వాటికి అప్రోచ్ రోడ్డులు నిర్మాణం ఇతర పనులను రాష్ట్ర ప్రభుత్వం తరుపున పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలి-పెదపావని రహదారిపై 43కోట్లతో చేపట్టిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పూర్తిచేశామని చెప్పారు.అలాగే విశాఖ జిల్లా యలమంచిలి వద్ద 5వనంబరు జాతీయ రహదారిపై 35కోట్లతోను,తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు వద్ద 28కోట్లతోను,కాకినాడ నగరంలో 65కోట్లతో,గూడూరు పట్టణంలో 63కోట్లతో,నంద్యాల వద్ద 39కోట్లో చేపట్టిన ఆర్ఓబి పనులు పూర్తి చేశామని వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు.అదేవిధంగా నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు-తెనాలి డబుల్ లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు.గుంటూరు-గుంతకల్ డబుల్ లైన్ నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయని వివరించారు.విజయవాడ-గుడివాడ-భీమవరం ఎలక్ట్రిఫికేషన్ తోకూడిన డబుల్ లైన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని జియం వివేక్ యాదవ్ వివరించారు.
విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి,వివిధ సౌకర్యాలను మెరుగుపర్చేందుకు రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని జియం పేర్కొన్నారు.విజయవాడ రైల్వేస్టేషన్ పై రైళ్ల రద్దీ భారాన్ని తగ్గించేందుకు విజయవాడ-విశాఖపట్నం మార్గంలో నడిచే కొన్ని గూడ్సు రైళ్లను, ప్రయాణీకుల రైళ్లలో 29 రైళ్లను రాయనపాడు నుండి బైపాస్ చేసేందుకు గుర్తించడం జరిగిందని అందుకు అనుగుణంగా రాయనపాడుకు మరిన్ని బస్సు సౌకర్యాలను కల్పించాలని సూచించారు.కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైనును నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉందన్నారు.
రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 119 ఆర్ఓబి/ఆర్ యుబిలు మంజూరు కాగా ఇప్పటికే 58పూర్తి కాగా,మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఈసమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్ మోహన్ సింగ్,ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ,ఆర్ అండ్ బి సిఇ నయూముల్ల,విజయవాడ రైల్వే డిఆర్ఎం ఆర్.ధనుంజయలు,అదనపు డిఆర్ఎం ఎంవిఎస్.రామరాజు,జియం కార్యదర్శి సి.నీలకంఠా రెడ్డి,చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విజయ్ అగర్వాల్,సిఇలు పిఎస్.బ్రహ్మానందం, జివి రమణా రెడ్డి,డిప్యూటీ సిఇలు తదితరులు పాల్గొన్నారు.