గ్రామాల్లో ఉపాధి లేకపోవడం, చిన్నా చితక పనులు చేసుకుందామంటే సమాజంలో చిన్నచూపు, ఉన్నతంగా బతకాలనే ఆశ.. ఇలా కారణమేదైనా.. యువత ఎక్కువగా పట్నం బాట పట్టినవారే.. ఉన్న ఊరిని, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరినీ విడిచి ఉద్యోగాల కోసం ఊరు విడిచిన వారే.. ఏసీ గదుల్లో ఉద్యోగం.. ఐదంకెల జీతం ఉండడంతో తమపై ఆధారపడిన కుటుంబానికి కొంతైనా సహాయ పడవచ్చని భావించినవారే.. అయితే ప్రస్తుతం వారి ఆలోచన మారుతోంది. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఖర్చులు పెరగడం, వేతనం సరిపోకపోవడం, లేదా ఉద్యోగ సంతృప్తి లేకపోవడంతో సొంతూరిలోనే ఏదైనా పని చేసుకుందామని పట్నం వీడి ఊరిబాట పడుతున్నారు.
చదువుకున్న యువత ఎక్కువగా తమ అర్హతకు సరిపోయే ఉద్యోగాలు స్థానికంగా ఉండకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి మహా నగరాలకు వెళ్లారు. అక్కడ ఐటీ కంపెనీల్లో, సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఐదంకెల జీతం చేసేవారు. తమ వేతనంలోంచి నెలనెలా కొంత తమ కుటుంబ సభ్యులకు పంపేవారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తమ వారిని కలుసుకోవడానికి రావడానికి వీలుంటుంది. ఐటీ, సాఫ్ట్‌వేర్‌లాంటి సంస్థల్లో అధిక వేతనం ఉన్నా.. పని ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. దీంతోపాటు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా.. ఉద్యోగానికి భద్రత కూడా ఉండదు. అంతేగాకుండా మహానగరాల్లో ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, ఇతర ఖర్చులు అధికంగానే ఉంటాయి. దీంతో పని ఒత్తిడి ఓవైపు.. పెరుగుతున్న ఖర్చులు మరోవైపు.. ఇలా మహానగరాల్లో పలువురు విసిగి వేశారుతున్నారు.
కాలంతో పోటీ పడుతున్న ప్రస్తుత సమాజంలో.. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునే వారే కరువయ్యారు. పట్టణాల్లోనూ ఇప్పుడు ఈ సంస్కృతి ఎక్కువవుతోంది. మహానగరాల్లోనైతే చెప్పాల్సిన పని లేదు. తమ ఇంటిపక్కన ఉండేవారి ముఖమే తెలియదంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్‌ల ప్రభావంతో నలుగురు కలిసినా.. ఎప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌పైనే ధ్యాసంతా.. ఇక మనసారా మాట్లాడుకోవడం, కష్టసుఖాలు పంచుకునే తీరిక ఎక్కడిది.. పక్కనే ఉన్నా పలకరించం కానీ.. వాట్సాప్‌లో మాత్రం గుడ్‌మార్నింగ్‌లు.. గుడ్ నైట్‌లకు తక్కువుండదు.. ఎదురుగా ఉన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పం.. కానీ ఫేస్‌బుక్‌లో మాత్రం హ్యాపీ బర్త్ డేలు.. ఇలా మనవారితో కంటే స్మార్ట్ ఫోన్‌లతోనే ఎక్కువగా గడుపుతున్నాం. దీంతో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది.
పెద్ద, పెద్ద నగరాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసేవారే ఎక్కువగా ఉంటారు. పొద్దున లేచింది మొదలు ఉరుకులు.. పరుగులు.. కాలు బయట పెడితే.. ట్రాఫిక్ తంటా.. సమయానికి ఆఫీసుకు వెళ్లకపోతే బాస్‌తో తంటా.. ఇన్ని తంటాల నడుమ పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో వారు పెడదోవ పట్టే అవకాశం ఉంది. ఇప్పటి పిల్లలకు అమ్మానాన్న తప్పితే అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, ఇతర బంధువుల గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కుటుంబాలు విడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు స్థానికంగా తమవారికి అందుబాటులో ఉంటూ వ్యాపారం, వ్యవసాయంలాంటివి చేసుకుందామని, పిల్లలకు అనుబంధాల విలువ తెలియాలని సొంతూళ్లకు వస్తున్నారు.