రాష్ట్రంలోని ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త తప్పనిసరిగా ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి ప్రభుత్వ పథకాలకు అనుకూలంగా ‘లైక్’లు కొట్టాలని టీడీపీ సర్కారు హుకుం జారీ చేసింది.చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ (సీడీపీవో), సూపర్‌వైజర్, అంగన్‌వాడీ కార్యకర్తలకు దీనికి సంబంధించి వ్యక్తిగతంగా ఆదేశాలు జారీ అవుతున్నాయి. గుంటూరుతోపాటు మరికొన్ని జిల్లాలో కింది స్థాయి దాకా ఇప్పటికే ఈ రకమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఐదేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందజేయడంతో పాటు పాఠశాలలకు వెళ్లటాన్ని అలవాటు చేయడానికి ఉద్దేశించిన అంగన్‌వాడీ కేంద్రాలకు, ఫేస్‌బుక్ ఖాతాలకు సంబంధం ఏమిటో? తమపై ఒత్తిడి తెచ్చి ఖాతాలు ఎందుకు తెరిపిస్తున్నారో అర్ధం కాక తలపట్టుకుంటున్నారు.ఇప్పటిదాకా ఫేస్‌బుక్ ఖాతాలు లేని అంగన్‌వాడీ కార్యకర్తలంతా తక్షణమే వీటిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రతి జిల్లాలో సీడీపీవో, ఏసీడీపీవో, ప్రాజెక్టు సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు వెంటనే ఫేస్‌బుక్‌ఖాతాలు తెరిచి జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫేస్‌బుక్ ఖాతాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రస్థాయిలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేసే ఫేస్‌బుక్ ఖాతాకు 13 జిల్లాలకు చెందిన ఉద్యోగులు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా పెట్టే అన్ని రకాల పోస్టింగులకు అంగన్‌వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా లైక్‌లు కొట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.అంగన్‌వాడీ కార్యకర్తలు తమ వ్యక్తిగత మిత్రులకు కూడా ఆ పోస్టులను షేర్ కూడా చేయాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీల పరిధిలో ప్రజలందరికీ ఆ పోస్టింగులను చూపిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలపై పూర్తి అవగాహన కలిగించాలని ఆదేశించారు. ఫేస్‌బుక్ ఖాతాలు తెరవని వారితోపాటు చురుగ్గా వినియోగించని వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో హెచ్చరించడం గమనార్హం.అధికార పార్టీ ఇప్పటికే వివిధ కార్యక్రమాల పేరుతో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తోంది. ప్రభుత్వ పథకాల పురోగతి, ధర్మ పోరాటం సభల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలతో ప్రచారం కోసం రూ.కోట్లలో వ్యయం చేసేందుకు సీఎం కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఇప్పటికే పనిచేస్తోంది. పలు పోస్టులను రూపొందించి ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు నామమాత్రపు గౌరవ వేతనంతో పనిచేసే అంగన్‌వాడీలను కూడా పార్టీ కార్యకర్తల తరహాలో ప్రచారం కోసం వినియోగిస్తుండటాన్ని అధికారవర్గాలే తప్పుబడుతున్నాయి.