రేణిగుంట మండల పరిధిలోని కుర్రకాలువ వద్ద 14.21 ఎకరాలలో నూతనంగా నిర్మించిన కులునరీ ఇన్‌స్టిట్యూట్ ఈనెల 19వ తేదీన భారత ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రూ.99కోట్లతో నిర్మిస్తున్న ఐసీఐ భారతీయ పాకశాస్త్ర విశ్వవిద్యాలయం దేశంలోనే మొదటిది కానున్నదని, రెండవది నోయిడాలో ఉందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన ప్రభుత్వ భూమిలో రూ.99కోట్లు వెచ్చించి ఎన్‌బీసీసీ ఈ నిర్మాణాన్ని గత రెండు సంవత్సరాలుగా నిర్మించిందన్నారు. ఇప్పటికే ఐసీఐలో 2016 నుంచి అలిపిరి వద్ద తరగతులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇందులో ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రవేశానికి ఆల్ ఇండియా ఏఈఈ పరీక్ష ఉంటుందని, మూడు సంవత్సరాల డిగ్రీకోర్సు, బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పాకశాస్త్ర విద్యాలయంలో ఉంటుందన్నారు. రాబోవురోజుల్లో ఎంసీఏ, ఎంబీఏ ప్రారంభించనున్నారన్నారు. ఇందులో 20 గెస్ట్ హౌస్‌లు, 4 వీఐపీ కాటేజీల తరగతుల గదులు, వంటశాలలు, అంతర్జాతీయ స్థాయి రెస్టారెంట్ వంటివి ఉన్నాయని తెలిపారు.జిల్లాలో ఇప్పటికే డ్వాక్రా మహిళలు స్వంతంగా చిన్న చిన్న హోటళ్లు నడుపుతున్నారని, వారికోసం సర్ట్ఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టాలని, చిన్నపిల్లల పౌష్టికాహారంపై రీసెర్చ్ చేయాలని, మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు ఓ వంట ప్రఖ్యాతి ఉందని, వాటిపై కూడా ఇక్కడ చదివే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా చూడాలని సూచించారు. ఫుడ్ ఫెస్టివల్ వంటివి తరచూ ఏర్పాటుచేయాలని ఐసీఐ ప్రిన్సిపల్‌కు జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం ఏపీ టూరిజం సెక్రటరీ మాట్లాడుతూ భారతీయ పాకశాస్త్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు లక్షల్లో వేతనాలు పొందే అవకాశం ఉందన్నారు. ఉపరాష్టప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో చేయనున్న ప్రారంభోత్సవాలు ఒక పద్ధతిగా చేపట్టాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టూరిజం శాఖల మంత్రులు, ప్రతినిధులు, 300 మందికి పైగా హాజరయ్యే సభ ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేసి పలు సూచనలు ఇచ్చారు. ఐసీఐతో పాటు నెల్లూరు జిల్లా కొత్తకోడూరు, పులికాట్, మైపాడు రిసార్ట్స్‌లను ఇక్కడినుంచే ఉపరాష్టప్రతి రిమోట్ ద్వారా ప్రారంభిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో టూరిజం విస్తరణ వలన ఇక్కడ చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు, అత్యిధిక వేతనాలు లక్షల్లో పొందచ్చన్నారు.