ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈకేసులకు సంబంధించి తొలిసారిగా జగన్ సతీమణి వై.ఎస్. భారతి పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ లో చేర్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటులో వైఎస్ భారతిని ఐదో నిందితురాలిగా చేర్చడం విశేషం. భారతీ సిమెంట్స్ లో పెట్టుబడులు పెట్టిన విషయంలో జగన్ తో పాటు భారతి పేరును కూడా ఛార్జిషీటులో చేర్చారు.భారతీ సిమెంట్స్ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ మూడు ఛార్జిషీట్లు దాఖలు చేయగా అందులో వైఎస్ భారతి ప్రస్తావన ఎక్కడా లేదు. సీబీఐ భారతి పేరు చేర్చకపోయినా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాత్రం ఆమె పేరును చేర్చడం చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం గ్రామాల సమీపంలో సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇక్కడ దాదాపు రెండువేల ఎకరాలను భారతి సమెంట్స్ కు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.భారతీ సిమెంట్స్ ద్వారా జగన్ ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్రమంగా పొందినట్లు సీబీఐ గుర్తించింది. అయితే సీబీఐ మాత్రం భారతి పేరును ఛార్జిషీట్ లో చేర్చలేదు. కాని ఈడీ విచారణ వేగవంతం చేయడంతో తాజాగా దాఖలు చేసిన ఛార్జి షీటులో భారతి పేరును చేర్చింది. దీంతో భారతి కూడా న్యాయస్థానానికి హాజరుకావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ ఛార్జిషీటును కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీ చేస్తు కోర్టుకు తప్పక హాజరు కావాలి. మొత్తం మీద సీబీఐ వదిలిపెట్టినా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాత్రం ఆదాయానికి మించిన ఆస్తుల కేసును వదలిపెట్టకుండా వేగం పెంచడం గమనార్హం.