నటీనటులు: కమల్‌హాసన్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్, వహీదా రెహమాన్ తదితరులు.
సంగీతం: మహమ్మద్ గిబ్రాన్
పాటలు: రామజోగయ్యశాస్త్రి
ఛాయాగ్రహణం: శ్యాం దత్, షైనుదీన్, షను జాన్ వర్గీస్
కూర్పు: మహేష్ నారాయణన్, విజయ్ శంకర్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
సమర్పణ: వి.రవిచంద్రన్
నిర్మాతలు: ఎస్.చంద్రహాసన్, కమల్‌హాసన్
రచన, దర్శకత్వం: కమల్‌హాసన్
సంస్థ: రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్
విడుదల: 10-08-2018
కమల్‌హాసన్‌లో ఎంత మంచి నటుడున్నాడో... అంతకు మించిన సాంకేతిక నిపుణుడు కనిపిస్తాడు. ముఖ్యంగా ఆయనొక మంచి కథకుడు. ఆ విషయాన్ని పలు చిత్రాలతో నిరూపించారు. తాను చెప్పాలనుకొన్న విషయాన్ని స్పష్టంగా, ధైర్యంగా చెబుతుంటారు. సున్నితమైన ఉగ్రవాదం నేపథ్యాన్ని ఎంచుకొని ‘విశ్వరూపం’ తెరకెక్కించారు. దేశవ్యాప్తంగా చర్చని రేకెత్తించిన ఆ చిత్రం పలు వివాదాల మధ్య విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందింది. దానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే ‘విశ్వరూపం2’. మరి ఈ చిత్రంతో కమల్ ఏం చెప్పారో, సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే: ఇండియన్ ‘రా’ ఆదేశాల మేరకు పనిచేసే సైనిక గూఢచారి విసామ్ అహ్మద్ కశ్మీరీ (కమల్‌హాసన్). అల్‌ఖైదా ఉగ్రవాదులతో కలిసి వాళ్ల వ్యూహాల్ని ఎప్పటికప్పుడు సైన్యానికి చేరవేస్తూ పలు దాడుల్ని ఆపుతాడు. ఆ విషయం తెలిసిపోవడంతో అల్‌ఖైదా ఉగ్రవాది ఒమర్ ఖురేషి (రాహుల్ బోస్)... విసామ్‌ని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. అలాగే ఇండియాలో 64 చోట్ల బాంబు దాడులకు పాల్పడేందుకు వ్యూహాలు రచిస్తాడు. యూకే సముద్ర అంతర్భాగంలో ఒక నావలో ఉన్న బాంబుల్ని పేలకుండా అడ్డుకోవడంతో పాటు, ఒమర్ ఖురేషిని విసామ్ ఎలా అంతం చేశాడు? నిరుపమ (పూజా కుమార్), అస్మిత (ఆండ్రియా), విసామ్‌కి ఎలా సాయం చేశారో తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే: యూకే నేపథ్యంలో కథ మొదలవుతుంది. తాను గూఢచారిగా ఎలా మారాడు? అల్‌ఖైదా స్థావరాల్లోకి ఎలా ప్రవేశించాడు? అక్కడ ఏం జరిగింది? ఎలా తిరిగొచ్చాడనే విషయాలు ఫ్లాష్‌బ్యాక్‌గా వస్తాయి. ఆ తర్వాత యూకేలోనే విసామ్‌పై హత్యాయత్నం జరుగుతుంది. అక్కడ తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అప్పటిదాకా నత్త నడకన సాగినట్టుగా అనిపించిన కథ కూడా పట్టాలెక్కినట్టుగా అనిపిస్తుంది. కానీ, ఆ ఎపిసోడ్ తర్వాత కథ ఎక్కడ మొదలైందో మళ్లీ అక్కడికే వచ్చి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. రా అధికారులకు, కమల్‌హాసన్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి. చెప్పడానికి కథేమీ లేకపోవడంతో సంభాషణలతో సన్నివేశాల్ని సాగదీశారు. అసలు సినిమా ఇంత సాగినా కథేమీ లేదు కదా..? అని డౌట్ వచ్చినట్టుందో ఏమో.. అప్పటికప్పుడు యూకేలో బాంబు పేలుడు జరగకుండా ఓ యాక్షన్ ఎపిసోడ్ మొదలవుతుంది. దాంతో సినిమాకి విరామం కార్డు పడిపోతుంది. ఆ తర్వాత కథ దిల్లీకి మారుతుంది. తల్లీ, కొడుకుల మధ్య సెంటిమెంట్ సన్నివేశాలు హృదయాల్ని హత్తుకుంటాయి. ఆ తర్వాత ఖురేషీ గ్యాంగ్, విసామ్ మధ్య యుద్ధం మొదలవుతుంది. విసామ్‌కు కాబోయే భార్య నిరుపమను, తల్లిని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ నుంచి వాళ్లని ఎలా రక్షించాడు? ఖురేషినీ ఎలా అంతం చేశాడు? ఇండియాలో 64 చోట్ల పెట్టిన బాంబుల్ని కూడా పేలకుండా ఎలా అడ్డుకున్నాడనే విషయాలతో శుభం కార్డు పడుతుంది. కథంతా ఊహకు తగ్గట్టుగానే సాగిపోతుంటుంది.
ఎవరెలా చేశారంటే: కమల్ హాసన్ అభినయం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తొలి సగభాగంలో ఈశ్వర శాస్త్రితో కలిసి చేసిన సన్నివేశాలు, అక్కడ సంభాషణలు, ద్వితీయార్ధంలో తన తల్లిగా నటించిన వహీదా రెహమాన్‌తో కలిసి నటించిన తీరు బాగుంటాయి. కమల్ చేసిన యాక్షన్ ఘట్టాలు కూడా సహజంగా సాగుతాయి. సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నారు. పూజా కుమార్, ఆండ్రియా అభినయాన్నీ, సినిమాకి కావల్సిన గ్లామర్‌నీ అందించారు. ఆర్మీ అధికారిగా శేఖర్ కపూర్, ఒమర్ ఖురేషీగా రాహుల్ బోస్ చాలా బాగా నటించారు. రాహుల్ బోస్ నటన ద్వితీయార్ధంలో మరింత సహజంగా సాగుతుంది. వహీదా రెహమాన్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న తల్లి పాత్రలో నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జిబ్రాన్ సంగీతం, శ్యాం దత్, షాను జాన్ వర్గీస్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. కమల్‌హాసన్ తొలి భాగంతో పోలిస్తే దర్శకుడిగా, కథకుడిగా కాస్త నిరాశపరుస్తాడు. సంభాషణలు సామాన్య ప్రేక్షకులకు ఒక పట్టాన అర్థం కాని రీతిలో, నిగూఢమైన అర్థాలతో వినిపిస్తుంటాయి.
బలాలు
+ కథా నేపథ్యం
+ నటీనటులు
+ పోరాట ఘట్టాలు
బలహీనతలు
- కథ, కథనాలు
- కాస్త సాగదీతగా అనిపించే ప్రథమార్ధం