- నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || 1 ||
తాత్పర్యము: దేవతలందరికంటే ముందుగా పూజిపబడే వాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను.
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||
తాత్పర్యము: ప్రధమ నామం: వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు), ద్వితీయ నామం: ఏకదంత (ఒకే దంతము కలవాడు), తృతీయ నామం: కృష్ణపింగాక్ష (ముదురు గోధుమ రంగు కన్నులవాడు),చతుర్థ నామం: గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు)
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || 3 ||
తాత్పర్యము: పంచమ నామం: లంబోదరం (పెద్ద పొట్ట కలవాడు), షష్టమ నామం: వికట (భారీ కాయము కలవాడు), సప్తమ నామం: విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు), అష్టమ నామం: ధూమ్రవర్ణ (ముదురు గచ్చకాయ రంగు కలవాడు)
నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||
తాత్పర్యము: నవమ నామం: బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు), దశమం: వినాయక (విఘ్నములకు నాయకుడు) ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి) ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు)
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || 5 ||
తాత్పర్యము: నవమ నామం: బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు), దశమం: వినాయక (విఘ్నములకు నాయకుడు) ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి) ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు)
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||
తాత్పర్యము: ఈ ద్వాదశ (పన్నెండు) నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్నవారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షము సిద్ధించును.
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || 7 ||
తాత్పర్యము: ఈ సంకట నాశన గణపతి స్తోత్రం ఆరు మాసాలపాటు జపించినవారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు.
అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ | తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||
తాత్పర్యము: ఈ సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మలకు దానం చేసినయెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును.