ఎట్టకేలకు దుర్గగుడి ఈవో పద్మపై ప్రభుత్వం బదిలీ వేటు పడింది. నూతన ఈవోగా ఐఆర్‌ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల కనకదుర్గమ్మ వారికి భక్తులు సమర్పించిన చీర మాయం కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పాలకమండలి సభ్యురాలు సూర్యలత ప్రమేయం ఉన్నట్లు తెలియడంతో పాలకమండలి నుంచి ఆమెను తొలగిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. దీనికి కొనసాగింపుగానే ఈవో పద్మను ప్రభుత్వం బదిలీ చేసినట్లు తెలుస్తోంది. పాలనా వ్యవహారాల్లో ఆమె చురుగ్గా ఉండటం లేదన్న ఆరోపణలు దీనికి కారణంగా చెబుతున్నారు.పద్మ దుర్గగుడి ఈవో పదవితో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం దేవాదాయ శాఖ కార్యదర్శి అనురాధ పదవీ విరమణ చేయడంతో.. ఆ అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆమె తన బాధ్యతల విషయంలో గందరగోళానికి గురవుతున్నారని.. విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని ప్రభుత్వం యోచించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు దుర్గగుడిలో చీర మాయం ఘటన ఆమె బదిలీకి కారణంగా తెలుస్తోంది. ఈ వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన పాలకమండలితో పాటు అధికారులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భక్తుల్లో వ్యతిరేక భావనకు దారితీసే అవకాశం ఉందని అన్నారు.దుర్గగుడి ఈవో బాధ్యతల నుంచి బదిలీ అయిన పద్మ ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా మాత్రమే కొనసాగనున్నారు. దుర్గగుడికి ఈవోగా ఐఏఎస్ అధికారులను నియమించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి సూర్యకుమారి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆలయంలో క్షుద్రపూజల వివాదం తలెత్తడంతో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసి పద్మకు ఈవో పగ్గాలు అందించింది. అయితే కొద్దికాలంలోనే చీర మాయం ఘటన కారణంగా ఆమెపై కూడా బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో నూతన ఈవోగా ఐఆర్‌ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.