YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

28 తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణ

28 తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 28వ తేదీ లోపే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు అమరావతిలో చెలరేగాయి. దీంతో ఆశావహులంతా చలో అమరావతి అంటూ వచ్చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అవుతుంది. ఇప్పటికి ఒకసారి మాత్రమే మంత్రి వర్గాన్ని విస్తరించారు. అది కూడా తన తనయుడు నారాలోకేష్ కోసమే మంత్రి వర్గాన్ని విస్తరించారన్న విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. దాదాపు 16 నెలల క్రితం నారా లోకేష్ తోపాటు వైసీపీకి చెందిన ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, సుజయకృష్ణ రంగరావు, అమర్ నాధ్ రెడ్డిలకు స్థానం కల్పించారు.అయితే బీజేపీతో సంబంధాలు తెగిపోయిన తర్వాత కేంద్ర మంత్రి వర్గం నుంచి తెలుగుదేశం మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు రాజీనామా చేశారు. దీనికి ప్రతిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నబీజేపీ మంత్రులు పైడికొండల మాణక్యాలరావు, కామినేని శ్రీనివాస్ లు కూడా కేబినెట్ నుంచి వైదొలిగారు. గత మూడు నెలల నుంచి ప్రధానమైన శాఖలు అలాగే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖతో పాటు దేవాదాయశాఖ మంత్రులను చంద్రబాబు నియమించాల్సి ఉంది. కాని వైద్య ఆరోగ్య శాఖను చంద్రబాబే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో కేబినెట్ మరోసారి విస్తరించాలని బాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ మేరకు చంద్రబాబు సంకేతాలు కూడా పంపారు. ఈ నెల 28వ తేదీన గుంటూరులో మైనారిటీల సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు ముందే చంద్రబాబు తన కేబినెట్ లో మైనారిటీకి చెందిన వారికి చోటు కల్పించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీకి చెందిన ముఖ్యులతో చర్చించినట్లు సమాచారం. ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎమ్మెల్సీగా ఎన్నికై ఇటీవల శాసనమండలి ఛైర్మన్ గా ఉన్న ఎన్.ఎం.డి. ఫరూక్ పేరు గట్టిగా విన్పిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పేరు కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా పేరును విన్పిస్తున్నా….ఆయన వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కావడంతో కొంత ఆలోచనలో పడ్డారని చెబుతున్నారు. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడంపై ఇంటా, బయటా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో చాంద్ భాషాకు అవకాశం లేదని దాదాపుగా తేలిపోయింది. ఫరూక్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.ఇక మంత్రివర్గ విస్తరణలో కేవలం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం కల్పిస్తారా? మరికొందరికి చోటు ఉంటుందా? అన్న చర్చ టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇంకా ఎన్నికలకు ఏడాది సమయమే ఉండటంతో సీనియర్ నేతలు బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లు మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కూడా మంత్రి పదవి ఇవ్వాలన్నది బాబు ఆలోచనగా ఉంది. ప్రస్తుత కేబినెట్ నుంచి ఎవరినీ తొలగించకున్నా మరో ఇద్దరిని ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Related Posts