YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

ఆస్ట్రేలియాను కుమ్మేసి కుర్రాళ్లు

ఆస్ట్రేలియాను కుమ్మేసి కుర్రాళ్లు

 - అత్యధిక వరల్డ్ కప్‌లు సాధించిన టీంగా రికార్డు

- సెంచరీతో కదం తొక్కిన మన్‌జోత్ కల్ర..

- ఆస్ట్రేలియా పతనంలో తలో చెయ్యి వేసిన భారత బౌలర్లు

- నాలుగోస్సారీ కప్ మనదే..!

కుర్రాళ్లు చరిత్ర సృష్టించారు. టోర్నమెంట్‌లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోకుండానే సగర్వంగా నాలుగోసారి అండర్ 19 ప్రపంచ కప్‌ను ఎత్తారు. సిరీస్ ఆరంభం నుంచి ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రాహుల్ ద్రవిడ్ అధీనంలోని భారత యువకులు ఫైనల్‌లోనూ అదే జోరు..హోరును చూపించారు. పృథ్వీ షా నేతృత్వంలోని టీం తమకు ఎదురైన ప్రత్యర్థులను చిత్తు చేస్తూ నాలుగో వరల్డ్ కప్‌ను ముద్దాడింది. మూడు ప్రపంచ కప్‌లను సాధించిన ఆస్ట్రేలియాను ఫైనల్‌లో చిత్తు చేసి ప్రపంచ కప్‌ను సాధించింది. తద్వారా అత్యధిక అండర్ 19 ప్రపంచ కప్‌లను నెగ్గిన టీంగా భారత్ చరిత్ర పుటల్లో ఓ అధ్యాయాన్ని లిఖించుకుంది. కుర్రాళ్లను అంతలా రాటుదేల్చుతున్న కోచ్ రాహుల్ ద్రావిడ్‌పైనైతే ప్రశంసల జడివాన కురుస్తోంది. టీమిండియా గ్రేట్ వాల్.. కుర్రాళ్లకు వెన్నెముకగా నిలిచారని సగటు క్రికెట్ అభిమాని అతడిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు. 

ఆస్ట్రేలియాను చిత్తు చిత్తుగా...
కాగా, మౌంట్ మౌంగాన్యూలోని బే ఓవల్ వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది భారత బ్యాటింగ్, బౌలింగ్ దళం. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది టీమిండియా. ఓపెనర్ మన్‌జోత్ కల్ర సెంచరీతో కదం తొక్కడంతో స్వల్ప లక్ష్యం వెలవెలబోయింది. ఆది నుంచే దూకుడుగా ఆడిన కర్ల.. 39వ ఓవర్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. 3 సిక్సర్లు 8 ఫోర్ల సాయంతో 102 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇక, కల్రాకు తోడుగా కెప్టెన్ పృథ్వీ షా (29, 4 ఫోర్లు), ఇన్‌ఫాం బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ (31, 4 ఫోర్లు), హార్విక్ దేశాయ్ (47, 5 ఫోర్లు నాటౌట్) తలో చెయ్యి వేయడంతో ఆస్ట్రేలియాపై 38.5 ఓవర్లలోనే భారత్ గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఫోర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు హార్విక్ దేశాయ్. ఫలితంగా భారత్‌ను చుట్టేయాలన్న ఆస్ట్రేలియా బౌలర్ల ఆశలపై నీళ్లుజల్లుతూ మరో 11.1 ఓవర్లు మిగిలుండగానే 220/2 పరగులు చేసి లక్ష్యాన్ని అధిగమించి కుర్రాళ్లు కుమ్మేశారు. కప్‌ను తెచ్చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో విల్ సదర్లాండ్, పరమ్ ఉప్పల్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆస్ట్రేలియాను భారత్ 216 పరుగులకు కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కల్రా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', శుభ్‌మన్ గిల్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌'లను సొంతం చేసుకున్నారు.

Related Posts