పేరుగాంచిన 36 మంది మెరికల్లాంటి మహిళలు శుక్రవారం నుంచి విధుల్లోకి వచ్చారు. దాదాపు 15 నెలల పాటు కఠోరమైన శిక్షణను వాళ్లు తీసుకున్నారు. పురుష జవాన్లకు సమానంగా ఎంతటి క్లిష్టమైన సాహసాలనైనా ఈ మహిళా కమాండోలు చేయగలరని ఢిల్లీ పోలీస్ అధికారులు తెలిపారు. వారు ఎటువంటి ఆయుధాన్నైనా సులువుగా ఉపయోగించగలరు. ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కోనగలరు. అత్యవసర సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించగలరు. ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వారిని ఆ చెర నుంచి సులభంగా విడిపించగలరు. అలాంటి అసామాన్య ప్రతిభా పాటవాలను ప్రదర్శించగల సామర్థ్యం ఉన్న మహిళా కమాండోల బృందం వచ్చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 36 మంది మహిళలతో కూడిన తొలి మహిళా కమాండో బృందం స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(స్వాట్) బృందంలో సేవలు అందించనున్నారు. ఎత్తయిన భవనాలు చకాచకా ఎక్కేయడం, బాంబులను నిర్వీర్యం చేయడం, బందీలను విడిపించడంలో వీళ్లు సిద్ధహస్తులు. దిల్లీలోని అయిదు పురుష కమాండో జట్లతో కలిసి వీరంతా పని చేయనున్నారు. భారత ఆర్మీతో పాటు ఇజ్రాయల్ కమాండోల ఆధ్వర్యంలో ఈ మహిళా బృందం 15 నెలల పాటు శిక్షణ తీసుకుంది. ఉగ్రవాదుల వ్యూహాలను సైతం చిత్తు చేసి వారిపై దాడి చేయడం ఈ టీమ్ ప్రత్యేకత అని అధికారులు తెలిపారు. పురుష కమాండోల కంటే అద్భుతంగా ఈ మహిళా కమాండో జట్టు పనిచేయగలదు. ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో ఈ కొత్త బృందం భద్రతా చర్యల్లో పాల్గొంటుంది.