పోలవరం పరిహారాల చెలింపుల్లో దళారులు చేరి నిర్వాసితులను నిలువునా దోచుకొంటున్నారని వారెవరో కాదు అధికార పక్షం వారేనని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు తదితరులతో కూడిన కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం రెండు రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో పర్యటించింది.ఈ నేపథ్యంలో మండలకేంద్రం యటపాక లో జరిగిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడిన రఘువీరా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయం పై తీవ్రంగా స్పందించారు. పునరావాసం పేరిట కడుతున్న కాలనీ లు పూర్తి నాణ్యతా లోపాలతో లోపయిష్టంగా ఉన్నాయన్నారు.అలాగే పునరావాస చర్యలు చేపట్టే విషయంలో ముంపు గుర్తింపు లో స్పష్టత లోపించిందన్నారు. ముఖ్యంగా విలీనం చేసుకున్న ముంపు మండలాలను గాలికొదిలేసారని అక్కడ సంక్షేమ పథకాల అమలు విషయంలో సవతి తల్లి ప్రేమ చూపుతున్నారన్నారు. పోలవరం నిర్వాసితుల త్యాగం వెలకట్ట లేనిదన్న రఘువీరా రెడ్డి నిర్వాసితులకి అమలు చెయ్యాల్సిన ప్యాకేజీ , అమలౌతున్న విధానంపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళతామన్నారు. సరైన రీతిలో ప్రభుత్వాలు స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన అప్పుడు తొలి ప్రాధాన్యత పోలవరం నిర్వాసితులకే నని భరోసా ఇచ్చారు.