తెలుగుదేశం నుంచి నాయకుల్ని ఆకర్షించాలనే వ్యూహం ప్రతిపక్ష నేత జగన్ కి ఎప్పట్నుంచో ఉంది! ఎన్నికల ముందు పెద్ద ఎత్తున టీడీపీ నేతల్ని పార్టీవైపు తిప్పుకోవడం ద్వారా టీడీపీకి కొంత టెన్షన్ పెంచాలనే వ్యూహంలో వైసీపీ ఉందనేది తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టిక్కెట్లు ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఆశావహుల్ని ఆకర్షించడం కాస్త సులువే అవుతుందన్న అంచనా కూడా వైకాపా వర్గాల్లో ఉంది. ఈ మేరకు కొంతమంది నేతల్ని చేర్చుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా… ఆయన పెడుతున్న కండిషన్ వల్ల వైసీపీలో చేరేందుకు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ, ఆ షరతు ఏంటంటే.. ‘రాజీనామా చేస్తేనే చేరిక’.తాజాగా ఒంగోలుకు చెందిన టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వైకాపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన్ని చేర్చుకోవడానికి జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామన్న భరోసా కూడా ఇచ్చారు. త్వరలోనే పార్టీలో చేరేందుకు ఆయన కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో.. ఆయన వెనక్కి తగ్గారు! కారణం ఏంటంటే… ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఆ పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ అన్నారట! నంద్యాల ఉప ఎన్నికలకు ముందు చక్రపాణి రెడ్డి ఇలానే రాజీనామా చేసి వచ్చాకనే పార్టీలో చేర్చుకున్నామని గుర్తుచేశారట.అయితే, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా.. ఈలోగా ఉన్న పదవిని వదులుకోవడం ఎందుకు అనే ఆలోచనలో మాగుంట పడ్డారని తెలుస్తోంది! పదవిని వదులుకుని వెళ్లిన శిల్పా చక్రపాణి కూడా వైకాపా సీటిస్తానని భరోసా ఇచ్చినా.. ఎన్నికల నాటి పరిస్థితి ఎలా మారుతుందో అనే ఆందోళన ఆయనలో లేదనీ చెప్పలేం కదా. అయితే, రాజీనామా కండిషన్ వల్ల మాగుంట కాస్త వెనకడుగు వేసేసరికి.. టీడీపీ శ్రేణులు అలెర్ట్ అయ్యాయనీ, ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.
ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో చర్చ ఏంటంటే.. రాజీనామా చేస్తే తప్ప వైకాపాలో చేర్చుకోమనే కండిషన్ పెడితే, పేరున్న నేతలు చేజారిపోతారనే అభిప్రాయం వ్యక్తమౌతోందని సమాచారం! టీడీపీని ఇరకాటంలో పెట్టాలంటే వైకాపా వైపు ఆసక్తి చూపుతున్నవారిని వెంటనే చేర్చుకోవాలి, ఆ తరువాత పదవులూ రాజీనామాల గురించి ఏ నిర్ణయమైనా తీసుకుంటే బాగుంటుందనీ, లేదంటే ఇలానే టీడీపీ అప్రమత్తం అవుతుందనే ఆవేదన కిందిస్థాయి వర్గాల నుంచి వ్యక్తమౌతుందట. కానీ, జగన్ ఈ కండిషన్ ను మార్చరు కదా! ఎందుకంటే, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పోరాటం అంటూనే అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. ఏదేమైనా, రాజీనామా చేస్తేనే చేరిక అనే షరతు వైకాపాకి ఒకరకంగా ఇబ్బందికరంగానే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.